టీడీపీ నేతల ఇసుక దందా.. ఇద్దరు అన్నదమ్ములు మృతి | Two Young Brothers Drown in Deep Pits Left by Illegal Mining in Chakrayapet | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల ఇసుక దందా.. ఇద్దరు అన్నదమ్ములు మృతి

Jun 21 2026 7:23 PM | Updated on Jun 21 2026 7:23 PM

Two Young Brothers Drown in Deep Pits Left by Illegal Mining in Chakrayapet

వైఎస్సార్ జిల్లా : చక్రాయపేట మండలంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అధికార పార్టీ టీడీపీ నేతల ఇసుక దందా ఇద్దరు అమాయక విద్యార్థుల ప్రాణాలను బలితీసుకుంది. పాపాగ్ని నదిలో సాగుతున్న అక్రమ ఇసుక తవ్వకాల వల్ల ఏర్పడిన భారీ గుంతల్లో పడి ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను అన్నదమ్ములైన జయంత్ రెడ్డి (17), రాజవర్ధన్ రెడ్డి (15)లుగా గుర్తించారు.

ఆదివారం నాడు బంధువుల ఇంటికి వచ్చిన వీరిద్దరూ, సరదాగా ఈత కొట్టేందుకు పాపాగ్ని నదికి వెళ్లి ఈ ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు విడిచారు. పిల్లలు కనిపించకుండా పోవడంతో గాలించిన స్థానికులకు, చాలా సేపటి తర్వాత వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. కళ్లెదుటే ఇద్దరు కొడుకులు శవాలుగా మారడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. వారి ఆక్రందనలు గ్రామంలో పెను విషాదాన్ని నింపాయి.ఈ దారుణానికి చక్రాయపేట మండలంలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ ఇసుక దందాయే కారణమని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అనుచరులు ఈ అక్రమ వ్యాపారాన్ని నడిపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా భారీ జేసీబీ యంత్రాలను నదీ గర్భంలోకి దించి ఇష్టారీతిన ఇసుకను తవ్వేస్తున్నారు. దీనివల్ల నది లోపల ప్రమాదకరమైన భారీ గోతులు ఏర్పడ్డాయి. అలా తవ్విన ఇసుకను చక్రాయపేట ప్రాంతం నుండి యథేచ్ఛగా బెంగళూరుకు తరలిస్తూ కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఈ భారీ గుంతల వల్లే ఈరోజు ఇద్దరు విద్యార్థులు లోపలికి దిగి బయటకు రాలేక ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.

వాస్తవానికి జిల్లా వ్యాప్తంగా అక్రమ ఇసుక తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు, వారి అనుచరులు ఈ ఆదేశాలను పూర్తిగా బేఖాతరు చేశారు. కలెక్టర్ ఆదేశాలను సైతం లెక్కచేయకుండా పాపాగ్ని నదిని ఇష్టమొచ్చినట్లు తోడేస్తున్నారు.

ఇసుక మాఫియా ఆగడాలపై స్థానిక ప్రజలు, పర్యావరణ ప్రేమికులు పలుమార్లు జిల్లా కలెక్టర్‌కు అధికారికంగా ఫిర్యాదులు కూడా చేశారు. అయినా అధికారుల నుండి ఆశించిన స్థాయిలో చర్యలు లేకపోవడం, ఇసుక దందా ఆగకపోవడం వల్లే ఈరోజు ఈ ఘోర ప్రమాదం జరిగిందని బాధితులు మండిపడుతున్నారు. అమాయక విద్యార్థుల మృతికి కారణమైన అక్రమ ఇసుక క్వారీ నిర్వాహకులపై, దానికి సహకరిస్తున్న టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, మృతుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలు ఉన్నా తవ్వకాలు ఎలా సాగుతున్నాయని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement