మా కష్టాన్ని దోచుకుంటున్నారు | Tomato farmers protest in Palamaneru | Sakshi
Sakshi News home page

మా కష్టాన్ని దోచుకుంటున్నారు

Jul 4 2026 5:24 AM | Updated on Jul 4 2026 5:24 AM

Tomato farmers protest in Palamaneru

పలమనేరులో టమాటా రైతుల ధర్నా 

మార్కెట్‌ గేట్ల మూసివేత  

మండీ నిర్వాహకులు, వ్యాపారులు దగా చేస్తున్నారని ఆగ్రహం 

కర్ణాటకలో బాక్సు రూ.300 పలుకుతుంటే ఇక్కడ రూ.100 కూడా లభించడం లేదు 

ఏఎంసీ చైర్మన్‌కు వ్యతిరేకంగా నినాదాలు

పలమనేరు: ఆరుగాలం శ్రమించి పండించిన టమాటాకు ధరలు తగ్గించి తమను దగా చేస్తున్నారంటూ శుక్రవారం చిత్తూరు జిల్లా పలమనేరు టమాటా మార్కెట్‌ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. టమాటా బాక్సులను 15 కిలోల నుంచి 18 కిలోలు, 20 కిలోలకు పెంచారని చెప్పారు. మండీ నిర్వాహకులు, వ్యాపారులు కుమ్మక్కై తమ రక్తం పీలుస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. మార్కెట్‌ గేట్లకు తాళాలు వేసి జాతీయ రహదారిపై బైఠాయించారు. పొరుగు మార్కెట్లకు, ఇక్కడికి ధరల్లో వ్యత్యాసం ఎందుకుందని నిలదీశారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజన్న డౌన్‌డౌన్‌... అంటూ నినాదాలు చేశారు. 

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మండీ నిర్వాహకులే వ్యాపారులుగా మారారని, సరుకు కొనేది, కమీషన్‌ తీసుకునేది వారేనని ఆరోపించారు. ఎవరైనా వ్యాపారులు వచ్చినా మండీవాళ్లతో కుమ్మక్కై ధరలు తగ్గించి తమ కష్టాన్ని దోచుకుంటున్నారన్నారు. 15 కిలోల టమాటా బాక్సు ధర పక్కనే ఉన్న కర్ణాటక వడ్డిపల్లిలో రూ.300 పలుకుతుంటే ఇక్కడ మాత్రం రూ.100 కూడా లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిబంధనలకు విరుద్ధంగా మండీల నిర్వాహకులు పదిశాతం కమీషన్‌ వసూలు చేస్తున్నా మార్కెటింగ్‌ అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పారు. దీంతోపాటు బాక్సుల దింపుడు కూలీ అని అదనంగా డబ్బు వసూలు చేస్తున్నారని తెలిపారు. 

ఎకరాకు రెండున్నర లక్షలు ఖర్చుపెట్టి పండిస్తే.. ఇక్కడ తమ రక్తాన్ని పీల్చేస్తున్నారని, తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులు ఆందోళన చేస్తున్నా ఏఎంసీ చైర్మన్‌ ఎందుకు రాలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. టమాటా రైతుల గురించి ఆయనకు ఏమాత్రం అవగాహన లేదన్నారు. మార్కెట్‌ కమిటీ సెక్రటరీ సంజీవకుమార్, ఎస్‌ఐ లోకేశ్‌రెడ్డి రైతులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. 

ఈ సమస్యపై రైతులు, మండీ నిర్వాహకులతో సోమవారం చైర్మన్‌ మాట్లాడతారని సెక్రటరీ హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. అనంతరం పోలీసులు మార్కెట్‌ గేట్లను తీశారు. రైతుల ఆందోళనతో జాతీయ రహదారిపై దాదాపు రెండు గంటలపాటు ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. పలమనేరు నియోజకవర్గంలోని పెద్దపంజాణి, గంగవరం, బైరెడ్డిపల్లి, పలమనేరు మండలాల రైతులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement