కర్నూలు(హాస్పిటల్): ‘ఫోన్‌లో మాట్లాడుతున్నానని నన్ను అకారణంగా సస్పెండ్ చేశారు. పనిచేసుకుంటానని, ఉద్యోగం తిరిగి ఇవ్వాలని కోరితే నా గదికి రా అని అంటున్నారు. నేను అలాంటిదాన్ని కాదంటే, ఇంకెవరినైనా తీసుకుని రమ్మని వేధిస్తున్నారు’ అని పద్మావతి శానిటేషన్ ఏజెన్సీ మేనేజర్లపై ఓ మహిళ ఆరోపణలు చేశారు. మహిళలను వేధిస్తున్నారంటూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని పద్మావతి శానిటేషన్ ఏజెన్సీ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు సోమవారం ధర్నా చేశారు. అందులో రెండు నెలల క్రితం సస్పెండైన ఓ మహిళ మాట్లాడుతూ.. మేనేజర్లు చెప్పినట్లు వినకపోతే మహిళలను లైంగికంగా వేధిస్తున్నారని, పని ఒత్తిడితో సతమతమయ్యేలా చేస్తున్నారని వాపోయారు.
కొందరితో వారి ఇళ్లల్లోనూ పనిచేయించుకుంటున్నారని, దీనిపై ఎవరైనాప్రశ్నస్తే వారిపైనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు యువత రాష్ట్ర నేత జూటూరు రవికుమార్ మాట్లాడుతూ.. శానిటేషన్ ఏజెన్సీ మేనేజర్లు రత్నరాజు, రమణతోపాటు, మీడియేటర్ హరిప్రసాద్‌తో మాట్లాడేందుకు తాము వెళ్లామని, ఈ క్రమంలో వారి ఫరీ్నచర్ వారే పగులగొట్టుకుని, తమపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు తమకు బంధువని చెబుతూ అందరినీ బెదిరింపులకు గురిచేస్తూ, వారి అక్రమాలను బయటకు రాకుండా చేస్తున్నారని అన్నారు.


