కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 30 ఏళ్ల మహిళకు హయాటస్ హెర్నియాకు అరుదైన శస్త్రచికిత్స విజయవంతం అయినట్లు జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ మాధవీశ్యామల చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వెల్లడించారు. రజియా(30) అనే మహిళ కొంత కాలంగా హయాటస్ హెర్నియాతో బాధపడుతోందన్నారు. ఇటీవల ఆమె చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిందని, దీంతో ముందుగా మందులతో చికిత్స అందించినప్పటికీ సమ స్య తగ్గకపోవడంతో ఆమెకు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీంతో ఆమెకు గత నెల 23న ల్యాప్రోస్కోపిక్ ఫండోప్లికేషన్ పద్ధతిలో శస్త్రచికిత్స చేశామన్నారు. ఆపరేషన్ అనంతరం ఆమె కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి శుక్రవారం డిశ్చార్జ్ చేసినట్లు వివరించారు. శస్త్రచికిత్స చేసిన వారిలో తనతో పాటు సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ సురేష్‌రెడ్డి, జనరల్ సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రారెడ్డి, డాక్టర్ ఎంఎస్.కార్తీక్ ఉన్నట్లు తెలిపారు. ఆపరేషన్‌ను విజయవంతం చేసిన వైద్యులను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్యసేవలను అందించేందుకు వైద్యులు కృషి చేస్తున్నారని, క్లిష్టమైన శస్త్రచికిత్సలను కూడా విజయవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని కొనియాడారు.


