శ్రీశైలానికి 227 టీఎంసీల నీరు రాక
తెలంగాణ తోడింది 88.90 టీఎంసీలు
కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం
రాయలసీమ రైతులకు తీవ్ర అన్యాయం
శ్రీశైలం డ్యాంలో 853.20 అడుగులకు పడిపోయిన నీటిమట్టం
నోరుమెదపని మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు
కర్నూలు(సిటీ): ‘కృష్ణాడెల్టాకు పట్టిసీమతో గోదా వరి జలాలు.. డెల్టాకు వినియోగించే కృష్ణా జలాలు రాయలసీమ జిల్లాలకు తరలించి కరువు నేలపై సిరులు పండిస్తాం.. తాగు, సాగు నీటికి శాశ్వత పరిష్కారం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకంతో చూపుతాం’ అని రాయలసీమ జిల్లాల్లో పర్యటించిన ప్రతి సందర్భంలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలో ఉన్న 2014 నుంచి 2019 వరకు, 2024 నుంచి ఇప్పటి వరకు రాయలసీమ జిల్లాల ప్రాజెక్టులకు సమృద్ధిగా నీరిచ్చిన దాఖలాలు లేవు. నాలుగు దశబ్దా లుగా ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది కరువు వచ్చి నా ఎగువ రాష్ట్రంలో కురిసిన వర్షాలతో శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద నీరొచ్చి చేరింది. తెలంగాణ ప్రభు త్వం ఎడమ విద్యుత్కేంద్రం ద్వారా నీటిని దిగువన ఉన్న సాగుకు విడుదల చేస్తోంది. అయినా చంద్రబా బు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఫలితంగా శ్రీశైలంలో నీటి నిల్వలు శరవేగంగా పడిపోయాయి. ఫలితంగా రాయలసీమలోని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
జూలైలోనే ఇన్‌ఫ్లో.. రైతులకు ఇచ్చింది శూన్యం
కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాలతో శ్రీశైలం రిజర్వాయర్‌కు జూలై 27న ఇన్‌ఫ్లో ప్రారంభమైంది. జూలైలో 27.16 టీఎంసీలు, ఆగస్టులో 192.01 టీఎంసీలు, సెప్టెంబరు నెలలో 6.28 టీఎంసీల చొప్పున నీరు వచ్చి చేరింది. ఈ ఏడాది జూరాల నుంచి 224.70 టీఎంసీలు, తుంగభద్ర నుంచి సుంకేసుల ద్వారా 2.56 టీఎంసీలు, హంద్రీనది నుంచి 0.31 టీఎంసీల నీరొచ్చింది. ఈ నీటిని తాగునీటికి ప్రాధాన్యత ఇచ్చి వినియోగించుకోవాలని కేఆర్‌ఎంబీ సూచించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం కేఆర్‌ఎంబీ ఆదేశాలను ఏ మాత్రం లెక్క చేయకుండా విచ్చలవిడిగా ఎడమ విద్యుత్కేంద్రం ద్వారా ఆగస్టు నెలలో 56.83 టీఎంసీలు, సెప్టెంబరు నెలలో 32.07 టీఎంసీల నీటిని విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నామని చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబు నామమాత్రంగా చేసిన ఫిర్యాదుతో కేఆర్‌ఎంబీ పట్టించుకోలేదు. ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నీటిని తోడేసింది. ఇన్‌ఫ్లో ఉన్నా, తెలంగాణ నీరును తోడుతున్నా రాయలసీమ ప్రాంత రైతుల కోసం ఖరీఫ్‌లో సాగునీటి కోసం చుక్క కూడా వదల్లేదు. దీనిపై రాయలసీమలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నోరువిప్పలేని దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా మంత్రులు కనీసం హంద్రీ–నీవా నీటిని 68 చెరువులకు, జీడీపీకి విడుదల చేయించుకోలేకపోయారు.
పబ్లిసిటీ కోసం పనులు
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటి విడుదల చేయాలంటే శ్రీశైలంలో 854 అడుగుల నీరు ఉండాలి. ఇప్పుడు 851 అడుగులకు పడిపోవడంతో కేవలం రెండు వేల క్యుసెక్కుల నీరు మాత్రమే విడుదలవుతోంది. రెగ్యులేటర్ సిల్ లెవెల్ 841 అడుగులు కాగా, 853 కంటే దిగువకు నీటి మట్టం చేరితే వెయ్యి, ఆ తరువాత 500 క్యుసెక్కులకు పడిపోనుంది. ఇప్పటికే కేసీ కెనాల్‌కి ప్రత్యామ్నాంగా నీటిని విడుదల చేసేందుకు చేపట్టిన ముచ్చుమరి లిఫ్ట్‌ను, మల్యాల లిఫ్ట్‌ను బంద్ చేయడంలో కేసీలో చుక్క నీరు కూడా విడుదల కావడం లేదు. హంద్రీ–నీవా కాల్వకు సైతం నీటి విడుదలను తగ్గించనున్నారు. ఏపీ వైపు ఉన్న కుడి విద్యుత్ కేంద్రం ద్వారా జూలై నెలలో 0.13 టీఎంసీలు, ఆగస్టులో 10.27 టీఎంసీల నీటిని దిగువకు వదిలేశారు. దీంతో పాటు చంద్రబాబు ప్రభుత్వం పబ్లిసిటీ కోసం పనులు పూర్తికాకుండానే వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి 6.38 టీఎంసీల నీటిని తరలించింది. రాయలసీమ జిల్లాలకు నీరు ఇవ్వకపోవడంపై రైతులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీశైలానికి 227.5 టీఎంసీ నీరు వచ్చినా రాయలసీమ జిల్లాలకు విడుదల చేసింది 38 టీఎంసీల నీరు మాత్రమే.
తెలుగుగంగ ద్వారా చైన్నె తాగుకు 10 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నారు.
సీమలోని ప్రాజెక్టులకు వచ్చిన నీటిలో ఇప్పటికే 5 టీఎంసీలకుపైగా తాగు నీటి పథకాలకు వినియోగించారు.


