ప్రకృతి హితం.. మన అభిమతం | Sakshi
Sakshi News home page

ప్రకృతి హితం.. మన అభిమతం

Published Wed, May 22 2024 5:29 AM

Today is International Biodiversity Day

ప్రత్యేక క్లైమేట్‌ చేంజ్‌ సెల్‌ను రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం 

‘లైఫ్‌ మిషన్‌’లో భాగంగా భూమి, పర్యావరణ పరిరక్షణ చర్యలు 

ఈబీఏ ద్వారా వాతావరణ సమస్యల పరిష్కారం 

డిస్కంలు, మున్సిపాలిటీలు, రవాణా సంస్థలకు భాగస్వామ్యం 

నేడు అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం

సాక్షి, అమరావతి: భావితరాలకు స్వచ్ఛమైన భూమి, గాలి, నీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థలు చేపట్టే పర్యావరణ హిత కార్యక్రమాల్లోను భాగమవుతోంది. పర్యావరణ హితం.. తమ అభిమతం.. అని చాటుతోంది. 

‘పుడమి సేవలో పరిశ్రమిస్తూ.. కాలుష్యాన్ని ప్రతిఘటిస్తూ.. పచ్చదనం పెంచుకుంటే.. ప్రకృతిని కాపాడుకుంటే.. మనిషికి అదే మనుగడ.. జీవకోటికదే తోడూ.. నీడ’ అంటూ ఈ ప్రయత్నంలో ‘భాగస్వామ్యం కండి’ అనే నినాదాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ మే 22న అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం నిర్వహిస్తున్నారు. సకల జీవులకు నిలయమైన ఈ భూమిని రక్షించే ఉమ్మడి కార్యాచరణలో మన దేశంతోపాటు మన రాష్ట్రం సైతం పాలుపంచుకుంటోంది. 

ఈ పవిత్రయజ్ఞంలో భాగంగా 2028నాటికి పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం వ్యక్తిగత, సామూహిక చర్యలు తీసుకోవడానికి కనీసం ఒక బిలియన్‌ మంది భారతీయులు, ఇతర ప్రపంచ పౌరులను సమీకరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘మిషన్‌ లైఫ్‌’ ప్రాజెక్టులో ఏపీ భాగమవుతోంది. దీనిద్వారా రానున్న నాలుగేళ్లలో 80శాతం గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలను పర్యావరణ అనుకూలమైనవిగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బృహత్తర యజ్ఞానికి విశాఖపట్నం నుంచి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది.   

జీవుల మనుగడకు అనుకూల చర్యలు 
ప్రకృతిలో ప్రతి ప్రాణి స్వేచ్ఛగా జీవించేందుకు అనువైన వాతావరణం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూమి, పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా క్లైమేట్‌ చేంజ్‌ సెల్‌(ఈఈఈ)ను రూపొందించింది. ఈ సెల్‌ వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళికతో సమానంగా పర్యావరణ వ్యవస్థ ఆధారిత అప్రోచ్‌(ఈబీఏ) ద్వారా రాష్ట్రంలో వాతావరణ మార్పుల సమస్యలను పరిష్కరిస్తుంది.

ఇందులో ఆయా రంగాల నిపుణులు, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్, విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు, అర్బన్‌ డెవలప్‌మెంట్, రవాణా శాఖలతోపాటు పలు ప్రభుత్వ రంగ సంస్థలకు భాగస్వామ్యం కల్పించింది. భూమి, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం కోసం మిషన్‌ లైఫ్‌ ఎనర్జీ కన్జర్వేషన్, వాటర్‌ కన్జర్వేషన్, సే నో టు సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్, అడాప్షన్‌ ఆఫ్‌ సస్టెయినబుల్‌ ఫుడ్‌ సిస్టమ్స్, వేస్ట్‌ రిడక్షన్, హెల్తీ లైఫ్‌ స్టైల్స్, ఈ–వేస్ట్‌ తగ్గింపు అనే ఏడు విభాగాల్లో 75 కార్యక్రమాలను మన రాష్ట్రంలో అమలుచేస్తున్నారు. 

అదేవిధంగా కాలుష్యాన్ని తగ్గించడం కోసం స్థానికంగా లైఫ్‌ గ్రూపులను ఏర్పాటుచేశారు. సైకిల్‌ ర్యాలీలు, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌లపై స్పెషల్‌ డ్రైవ్‌లు, సోషల్‌ మీడియాలో ప్రచారం, కమ్యూనిటీ వర్క్‌షాపులు, సెమినార్లు, క్విజ్‌ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నారు. కాలుష్య కారక వాహనాలను అరికట్టడం కోసం ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డ్రైవ్‌లను చేపడుతున్నారు. పాఠశాలల్లో ఎనర్జీ క్లబ్‌ల ఏర్పాటు ద్వారా భూమి పరిరక్షణ ఆవశ్యకతపై చైతన్యం తీసుకువస్తున్నారు.  

విశాఖలో లైఫ్‌ మిషన్‌ అమలు
పర్యావరణ హిత జీవనశైలిని అనుసరించేలా ప్రజలను ప్రోత్సహించడమే లక్ష్యంగా మొదలైన లైఫ్‌ స్టైల్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ పథకం అమలుకు రాష్ట్రంలోని సముద్ర తీరప్రాంతంలో ఉన్న విశాఖ నగరం అనుకూలమని బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ) గుర్తించింది. దేశవ్యాప్తంగా 2028 నాటికి 5.15 లక్షల గ్రామాలు, 3,700 పట్టణ స్థానిక సంస్థల్లోని కోటి మంది ప్రజలను ‘ప్రో ప్లానెట్‌ పీపుల్‌’గా మార్చాలనేది లైఫ్‌ మిషన్‌ లక్ష్యం. 

పుడమి, జీవ పరిరక్షణ కోసం చేపట్టిన ఈ పథకాన్ని విశాఖలో అమలు చేయనున్నట్లు బీఈఈ ఇటీవల ప్రకటించింది. విశాఖతోపాటు విజయవాడ, కాకినాడ, కర్నూలు, తిరుపతి నగరాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు బీఈఈ వెల్లడించింది. లైఫ్‌ మిషన్‌ అమలుకు బీఈఈ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దశలవారీ కార్యాచరణ రూపొందిస్తోంది.  

Advertisement
 
Advertisement
 
Advertisement