సాక్షి, హైదరాబాద్: దేశంలో పండుగలు జరుపుకునే తీరుపై విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఎస్.ఒకా(Justice Abhay S. Oka) అభ్యంతరం వ్యక్తం చేశారు. వాయు, శబ్ధ, జల కాలుష్యాలకు కారణమవుతున్న పండగ సంబరాల విషయంలో న్యాయ వ్యవస్థ కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఇటీవల ‘‘కాలుష్యం.. వాతావరణ మార్పులు.. మనం.. సుస్థిర భవిష్యత్తు’’ అనే అంశంపై ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పండుగల పేరుతో పర్యావరణ నాశనాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
మత సంప్రదాయాల పేరుతో విదేశాల్లో స్థిరపడ్డ ఎన్నారైలు నదులను కలుషితం చేస్తున్న వైనం, వీధుల్లో హద్దులు, నిబంధనలు మీరి జరుపుకున్న దీపావళి వేడుకల కారణంగా పలు చోట్ల పౌరులకు అసౌకర్యం, కొన్ని చోట్ల ప్రమాదాలు సంభవించడం వంటి ఘటనల జరుగుతున్న నేపథ్యంలో జస్టిస్ అభయ్ ఎస్.ఓకా మాటలకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడుతోంది. అంతేకాదు.. దీపావళి, గణేశ్ ఉత్సవాలు, న్యూఇయర్ వేడకల్లో తొక్కిసలాటలు, ప్రమాదాల కారణంగా పలువురు గాయపడుతూండటం, కొందరు ప్రాణాలు కోల్పోతూండటం కూడా జస్టిస్ ఓకా వ్యాఖ్యలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.
‘‘టపాసులు కాల్చడం, లౌడ్ స్పీకర్లతో ఊరేగింపులు.. నదుల్లో విగ్రహాల నిమజ్జనం వంటివి ఏవీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కింద వచ్చే అత్యంత ప్రధానమైన మత సంప్రదాయల కిందకు రావు’’ అని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో మన వైఫల్యానికి కీలకమైన కారణం ఏమిటంటే.. అటు పౌరులు, ఇటు ప్రభుత్వం కూడా రాజ్యాంగంలోని 51ఏ నిబంధనల్లోని ప్రాథమిక బాధ్యతలను విస్మరించడం అని ఆయన అన్నారు.‘‘దురదృష్టకరమైన అంశం ఏమిటంటే.. మతం పేరుతో పర్యావరణాన్ని నాశనం చేసే ధోరణి ఉండటం. అయితే ప్రపంచంలోని ప్రతి మతం కూడా ప్రకృతిని కాపాడమనే చెబుతోంది. సాటి జీవజాతులతో సహానుభూతితో వ్యవహరించమనే చెబుతుంది. పండుగలను జరుపుకునే క్రమంలో పర్యావరణాన్ని నాశనం చేయమని, జంతువుల పట్ల క్రూరత్వంతో వ్యవహరించమని ఏ మతమూ చెప్పదు’’ అని స్పష్టం చేశారు. దీపావళి వస్తే టపాసుల శబ్ధాలతో ఊళ్లకు ఊళ్లు మారుమోగిపోవడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ఈ శబ్ధాలకు పక్షలు, జంతువులు బెదిరిపోతూంటాయి. చిన్న పిల్లలు, వయోవృద్ధులు కూడా చాలా ఇబ్బంది పడుతూంటారు. వీరందరిని ఇబ్బంది పెట్టడంలో వచ్చే సంతోషం ఏమిటి?’’ అని ప్రశ్నించారు.
న్యాయ వ్యవస్థ ఆదర్శంగా నిలవాలి..
ప్రకృతిని కాపాడే విషయంలో న్యాయ వ్యవస్థ అందరికీ ఆదర్శంగా నిలవాలని, ఇది రాజ్యాంగబద్ధమైన బాధ్యత అన్నది గుర్తించాలని ఆయన కోరారు. పౌరులు, రాజ్యం కూడా మత సెంటిమెంట్ల ప్రభావానికి లోనుకాకుండా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని పిలుపునిచ్చారు. మతపెద్దలు, రాజకీయ నేతలు కూడా పండుగల సమయంలో కలిగే కాలుష్యం, అసౌకర్యాల విషయంలో నోరెత్తకపోవడంపై జస్టిస్ అభయ్ ఎస్. ఓకా అందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ సంబంధిత న్యాయం కోసం పోరాడుతున్న వారికి సమాజం నుంచి మద్దతు కూడా కరవు అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.


