ఇండోనేషియాలో ‘దేవతల దీవి’గా పేరున్న బాలి ద్వీపానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకస్థానం ఉంది. ఇది కేవలం అందమైన బీచ్‌లు, వరి పొలాలకే కాకుండా ఆధ్యాత్మిక పండుగలకు కూడా ప్రసిద్ధి. నిజానికి హిందూ–బౌద్ధ మతాల కలయికను పాటించే అతిపెద్ద జాతి బాలినీస్! వారు 210 రోజులకు ఒకసారి, బాలినీస్ క్యాలెండర్ (పావుకోన్) ప్రకారం జరుపుకునే పండుగను బాలినీస్ ఫెస్టివల్ అంటారు.
ఈ క్రమంలోనే ఈ ఏడాది నవంబర్ 19 నుంచి 29 వరకు పదిరోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో ‘గలుంగన్’ అనే పేరుతో జరిగే మొదటిరోజు వేడుక, అత్యంత ప్రత్యేకమైనది. ఈ పండుగ సందర్భంగా, ద్వీపం అంతటా రహదారుల పక్కన పెన్జోర్ (అలంకరించిన పొడవైన వెదురు స్తంభాలు) ఏర్పాటు చేస్తారు. ఇవి దైవత్వాన్ని ఆహ్వానించడానికి, శ్రేయస్సుకు కృతజ్ఞతలు తెలియజేయడానికి గుర్తుగా నిలుస్తాయి. పది రోజుల తర్వాత వచ్చే కుణీంగాన్ పండుగతో ఈ ఫెస్టివల్ ముగుస్తుంది. ఆ చివరి రోజున తమ పూర్వీకుల ఆత్మలు తిరిగి స్వర్గానికి వెళ్తాయని అక్కడివారు నమ్ముతారు.
ప్రతి దేవాలయంలో ఒడాలన్ (ఆలయ వార్షికోత్సవం) ఉత్సవం జరుగుతుంది. సంప్రదాయ నృత్యాలు, సంగీతం, ప్రత్యేకమైన కళల ప్రదర్శన కన్నుల పండుగగా సాగుతుంది. ఈ బాలినీస్ పండుగలు కేవలం వేడుకలు మాత్రమే కావు, ఇవి బాలినీస్ ప్రజల సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి.
ఆధ్యాత్మికతలో ఆదర్శం!
బాలీలో మరొక ముఖ్యమైన పండుగ న్యేపి (మౌన దినం) గురించి చెప్పుకోవాల్సిందే! సకా క్యాలెండర్ ప్రకారం బాలి ప్రజలు నూతన సంవత్సరం ప్రారంభాన్ని పురస్కరించుకుంటూ న్యేపీని ఆత్మపరిశీలన దినంగా జరుపుకుంటారు. ఇది ఎక్కువగా మార్చి నెలలో జరుగుతుంటుంది.
న్యేపి రోజున, ద్వీపం మొత్తం 24 గంటల పాటు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుంది. విమానాశ్రయాలను మూసివేస్తారు. వీధులు నిర్మానుష్యంగా ఉంటాయి. స్థానికులంతా ప్రార్థన, ధ్యానం, ఆత్మపరిశీలనలో నిమగ్నమవుతారు. ఇది లోతైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది.
(చదవండి: గాజు డిస్క్: చిన్నదేగానీ..చిరంజీవి)


