ములుగు: నల్లబెల్లి మండ ల పరిసర గ్రామాల్లో తిరుగుతూ గంగిరెద్దును ఆడించే పెద్ద వెంకటయ్యది మూడు తరాల చరిత్ర. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వృత్తే అతడికి జీవనాధారం. వెంకటయ్య దగ్గర ఉన్న గంగిరెద్దు పేరు పెద్దరాయుడు. తెల్లటి శరీరం, నుదుట ఎర్రని చుక్క, మెడలో గంటలతో అడుగు పెడితే పిల్లలందరూ చుట్టుముడుతారు. ‘పెద్దరాయుడిని మేము ఎద్దులా చూడము. మా కుటుంబంలో నా కన్న బిడ్డలా చూసుకుంటాం’అని పెద్ద వెంకటయ్య చెప్పుతుంటే ఆయన కళ్లలో గర్వం, ప్రేమ కనిపించాయి. పెద్దరాయుడు గురించి ఆయన మాటల్లో..
కఠినమైన శిక్షణ.. ప్రేమతోనే సాధ్యం
ఒక ఎద్దును గంగిరెద్దుగా తీర్చిదిద్దడం వెనుక ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది. తిరుపతి కొండల్లో గురువు ప్రేమ సైగలతో శిక్షణ ఇస్తారు. డూడూ బసవన్న అంటే తల ఊపడం, కాళ్లతో తాళం వేయడం, యజమాని మాట ప్రకారం ఆశీర్వదించడం ఇవన్నీ నేర్పడానికి ఎంతో ఓర్పు ఉండాలి. ప్రతిరోజూ పెద్దరాయుడు (గంగిరెద్దు)కు స్నానం చేయించి ప్రత్యేకమైన ఆహారం అందిస్తూ కుటుంబ సభ్యులకంటే జాగ్రత్తగా కాపాడుకుంటున్నా. పండుగ సమయంలో గతంలో బియ్యం, ధాన్యం, కాసిన్ని డబ్బులు ఇచ్చేవారు. కానీ పట్టణీకరణ పెరగడం, ప్రజల్లో ఆసక్తి తగ్గడంతో ప్రస్తుతం ఆదరణ తగ్గింది. కుటుంబ పోషణతోపాటు ఎద్దు మేతకు కూడా ఇబ్బంది అవుతోంది. ప్రభుత్వం మమ్ముల్ని కళాకారులుగా గుర్తించి పింఛన్ ఇవ్వాలి. పశుపోషణకు సాయం చేస్తే ఈ కళను బతికించుకుంటాం.


