
పర్యావరణం, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు
గాలి, నీరు, ఆహారం ద్వారా శరీరంలోకి చొరబాటు
ఊపిరితిత్తులు, రక్తంలో కలిసి వాపు, మంట, హార్మోన్ల అసమతౌల్యతకు దారితీస్తున్న వైనం
దీర్ఘకాలిక వ్యాధులను మోసుకొచ్చే వాహకాలుగానూ మారుతున్నట్లు వెల్లడి
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంత తగ్గించాలంటున్న వైద్య నిపుణులు
సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్యం, పర్యావరణ వ్యవస్థలపై అతిసూక్ష్మ ప్లాస్టిక్ కణాలైన మైక్రో ప్లాస్టిక్స్ పెనుప్రభావం చూపుతున్నాయి. గాలి, తాగునీరు, ఆహారం ద్వారా మనుషుల శరీరంలోకి చొరబడుతున్నాయి. ఊపిరితిత్తులు, రక్తం, మాయ కణజాలం (ప్లసెంటల్ టిష్యూ)లోకి చేరి వాపు, మంట (ఇన్‌ఫ్లమేషన్)కు, హార్మోన్ల అసమతౌల్యతకు కారణమవుతున్నాయి. దీర్ఘకాలిక రోగాలకు కారణమయ్యే విషపూరిత రసాయనాలు, వ్యాధికారకాలను మోసుకేళ్లే వాహకాలుగా పనిచేస్తున్నాయి.
అతిపెద్ద సవాళ్లలో ఒకటి...
మైక్రో ప్లాస్టిక్స్ పర్యావరణంలోకి ప్రవేశించాక వాటిని తొలగించడం కష్టసాధ్యంగా మారుతోంది. ఇవి ఒక మైక్రోమీటర్ నుంచి 5 మిల్లీమీటర్ల మధ్య పరిమాణంలో ఉండటమే అందుకు కారణం. ప్లాస్టిక్ పాలిమర్‌లు మన్నికైనవిగా, రసాయన విచ్చిన్నానికి నిరోధకతను కలిగి ఉండేలా రూపొందించడం వల్ల మైక్రోప్లాస్టిక్స్ వాతావరణంలో వందల, వేల సంవత్సరాలపాటు కొనసాగే గుణం కలిగి ఉన్నాయి. ముఖ్యంగా భౌతిక, రసాయన వాతావరణం (యూవీ రేడియేషన్, వేడి మొదలైనవి) కారణంగా ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లాస్టిక్ బ్యాగ్‌ల వంటి పెద్ద ప్లాస్టిక్ వస్తువులు సూక్ష్మ ప్లాస్టిక్ కణాలుగా విచ్చిన్నమై వాతావరణంలో కలిసిపోతున్నాయి. దీంతో వాటిని భారీ స్థాయిలో శుభ్రపరిచే ప్రయత్నాలు దాదాపు అసాధ్యంగా మారాయి.
వివిధ అధ్యయనాల్లో వెల్లడి...
ప్రపంచంలో ఏటా 265 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని అంచనా. 2015 నాటి అంచనా ప్రకారం మహాసముద్రాల్లో 15 నుంచి 51 ట్రిలియన్ మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నాయి. ఇవి దాదాపు 93 నుంచి 236 మిలియన్ టన్నుల మైక్రోప్లాస్టిక్‌లకు సమానం. మైక్రోప్లాస్టిక్‌లు ఆహార వ్యవస్థలోకి చొచ్చుకుపోవడం లేదా చర్మం ద్వారా కూడా మనుషుల్లోకి చేరుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 11,845 నుంచి 1,93,200 మైక్రోప్లాస్టిక్ కణాలు మనుషుల్లోకి చేరుతున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
2021 నాటి అధ్యయనం ప్రకారం... యూరప్‌లోని 90% కంటే ఎక్కువ మంచినీటి సరస్సులు, నదులు మైక్రోప్లాస్టిక్‌లతో కలుషితమయ్యాయి. ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2020లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం ప్రతి హెక్టార్ వ్యవసాయ నేలల్లో 0.1 నుంచి 0.5 మిలియన్ల మైక్రోప్లాస్టిక్ కణాలు ఉండొచ్చని వెల్లడైంది. ఇది నేల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేయడంతోపాటు పంటల ద్వారా ఆహార వ్యవస్థలోకి ప్రవేశించే అవకాశం ఉందని తేలింది.
క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ 2020 అధ్యయనం ప్రకారం పట్టణ ప్రాంతాల్లోని గాలి నమూనాల్లో నిత్యం చదరపు మీటర్‌కు 100 మైక్రోప్లాస్టిక్ కణాలు ఉంటాయని అంచనా. 2022లో ఎన్విరాన్‌మెంట్ ఇంటర్నేషనల్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో 50% కంటే ఎక్కువ మంది (సర్వే చేసిన వారిలో) రక్తప్రవాహంలో మైక్రోప్లాస్టిక్ కణాలను గుర్తించారు.
ఊపిరితిత్తులు, రక్తం ద్వారా అవయవాల్లోకి మైక్రోప్లాస్టిక్స్ చేరడం వల్ల ఆయా అవయవాల్లో వాపు, మంట (ఇన్‌ఫ్లమేషన్) కలుగుతుంది. అలాగే హార్మోన్ల అసమతౌల్యతకు దారితీస్తుంది. విషపూరిత రసాయనాలు, వ్యాధికారకాలను మోసుకేళ్లే వాహకాలుగానూ మైక్రోప్లాస్టిక్స్ పనిచేస్తున్నాయి. ప్రజలు వ్యక్తిగత స్థాయిలో ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్’పై ఆధారపడడాన్ని వీలైనంత తగ్గించుకోవాలి. – డాక్టర్ హరికిషన్ గోనుగుంట్ల, చీఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, యశోద ఆసుపత్రి
మైక్రోప్లాస్టిక్స్– వాటి రూపాలు ఇలా...
⇒ వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు: టూత్‌పేస్ట్‌లు, స్క్రబ్‌లు, ఎక్స్‌ఫోలియెంట్లు, మైక్రోబీడ్స్ ఉన్న లోషన్లు.
⇒ సింథటిక్ దుస్తులు: పాలిస్టర్, నైలాన్, యాక్రిలిక్‌తో తయారు చేసిన బట్టలు ఉతకడం వల్ల విడుదలవుతాయి.
⇒ ప్లాస్టిక్ గుళికలు: ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీలో ఉపయోగించే చిన్న ప్లాస్టిక్ రెసిన్ గుళికలు (నర్డిల్స్)
⇒ వ్యవసాయ రసాయనాలు: ఎరువులు, పురుగుమందుల్లో (ఉదా. ప్లాస్టిక్ పూత పూసిన ఎరువులు) ఉంటాయి.
⇒ పెద్ద ప్లాస్టిక్ శిథిలాలు: కాలక్రమేణా చిన్నచిన్న ముక్కలుగా విరిగిపోయే ప్లాస్టిక్ సీసాలు, సంచులు, ప్యాకేజీలు.
⇒ చేపలు పట్టే పరికరాలు: వలలు, లైన్లు, మైక్రోప్లాస్టిక్‌లుగా క్షీణించే ఇతర పరికరాలు.
⇒ టైర్లు: వాహనాల టైర్లు అరిగిపోవడం వల్ల పర్యావరణంలోకి చిన్న ప్లాస్టిక్ కణాలు విడుదలవుతాయి.