కదంతొక్కిన పొగాకు రైతులు | Tobacco farmers hold protest rally in Ongole against governments attitude | Sakshi
Sakshi News home page

కదంతొక్కిన పొగాకు రైతులు

Jun 20 2026 5:05 AM | Updated on Jun 20 2026 5:05 AM

Tobacco farmers hold protest rally in Ongole against governments attitude

ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఒంగోలులో వందలాది ట్రాక్టర్లు, బైకులతో భారీ ర్యాలీ

ఒంగోలు టౌన్‌/కొండపి: పొగాకు ధరలు పతనమవుతుండటంతో దిక్కుతోచని రైతులు ఒంగోలులో ఒక్కసారిగా రోడ్డెక్కారు. వందలాది ట్రాక్టర్లు, బైక్‌లతో శుక్రవారం భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. పొగాకు పంటకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, పొగాకు కొనుగోలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేరో రూ.500 కోట్ల చొప్పున కేటాయించి తమను ఆదుకోవాలని నినదించారు. సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు నిర్వహించిన ఈ ర్యాలీకి సీపీఐ, సీపీఎం, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, కౌలు రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి. 

ఇందులో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ..పొగాకు పంటకు గిట్టుబాటు ధరల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాస్తున్నట్లు చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. రూ.200 తక్కువ కాకుండా పొగాకు కొనుగోలు చేయాలని సీఎం చంద్రబాబు హడావుడిగా అధికారులను ఆదేశించారని, చంద్రబాబు మాటల మీద నమ్మకం లేకనే పొగాకు రైతులు వందలాది మంది ర్యాలీకి తరలివచ్చారని చెప్పారు. పొగాకు రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

మద్దతు ధర కోసం ధర్నా..
పొగాకుకు కనీస మద్దతు ధర కిలోకు రూ.300 ఇవ్వాలని కోరుతూ శుక్రవారం ప్రకాశం జిల్లా కొండపి వేలం కేంద్రంలో రైతులు వేలాన్ని బహిష్కరించి రోడ్డుపై ధర్నా చేశారు. నేతివా­రి­పాలెం గ్రామం రైతులు తెచ్చిన పొగాకులో కేవ­లం 51 బేళ్లకే వేలం నిర్వహించారు. అందులో నాణ్యమైన బేళ్లకు కూడా కేజీ రూ.170, రూ.180 ధర నిర్ణయించడంతో రైతులు ఆగ్రహించారు. వ్యాపారులు, వేలం కేంద్ర అధికారితో వాగ్వా­దానికి దిగారు. వేలాన్ని బహిష్కరించి ట్రాక్టర్లతో రోడ్డుపై నిరసన తెలిపారు. 

ఆ సమయంలో రోడ్డుపై ధర్నా చేస్తే ధరలు పెరగవని.. మీడియా­కు పబ్లిసిటీ అవడం తప్పితే ఏమీ ఉండదని వేలం కేంద్రం నిర్వహణాధికారి ఒక రైతు­తో రాయబారం పంపించారు. దీంతో రైతులు మరింత ఆగ్రహించారు. తమ నిరసనలు ప్రభుత్వానికి తెలిస్తేనే కదా ధరలు పెంచేదని రైతులందరూ భీష్మించి రోడ్డుపై ధర్నా చేశారు. కేజీ రూ.300కు అయినా కొంటేనే నష్టాల నుంచి బయటపడతామని, అప్పటి వరకు వేలాన్ని బహిష్కరిస్తున్నట్లు వేలం నిర్వహణాధికారి శంకరరావుకు వినతిపత్రమిచ్చారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement