సాక్షి, విజయనగరం: కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఏపీలో సాగుతున్న అరాచకాలపై గళమెత్తిన జర్నలిస్టులపై ఉక్కుపాదం మోపుతోంది. మంత్రి లోకేష్ ‘రెడ్ బుక్’ పేరుతో ఏపీలో సాగిస్తున్న రాజకీయ విధ్వంసాన్ని ప్రశ్నించినందుకు.. తెలంగాణకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ కేవీఆర్ (KVR)ను ఏపీ పోలీసులు అర్ధరాత్రి పూట అక్రమంగా అరెస్ట్ చేశారు.
తన యూట్యూబ్ ఛానల్‌లో ఏపీలోని పరిస్థితులను ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ అని వ్యంగ్యంగా ప్రస్తావిస్తూ కేవీఆర్ చేసిన వ్యాఖ్యలను.. కావాలనే భారత రాజ్యాంగానికి ఆపాదిస్తూ కూటమి కార్యకర్తలు ఏపీలో పలు చోట్ల ఫిర్యాదులు చేశారు. విజయనగరం జిల్లా బాడంగి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు ఆధారంగా బొబ్బిలి రూరల్ సీఐ శ్రీనివాస్ నేతృత్వంలోని పోలీస్ బృందం తీవ్ర ఒత్తిడిల నడుమ హైదరాబాద్‌లోని సరూర్ నగర్‌లో ఉన్న కేవీఆర్ నివాసంలో ఆయన్ను అరెస్ట్ చేసింది. కనీసం 41-ఏ నోటీసు కూడా ఇవ్వకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఈ అరెస్ట్ సాగింది.
మరోవైపు పోలీసుల నోటీసులకు స్పందించలేదన్న కారణాన్ని చూపిస్తూ.. బొబ్బిలి న్యాయస్థానం కేవీఆర్‌కు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన్ను బొబ్బిలి సబ్ జైలుకు తరలించారు. అయితే, సుప్రీంకోర్టు ఆదేశాలను కాలరాస్తూ.. మఫ్టీలో వచ్చి జర్నలిస్ట్ కేవీఆర్‌ను అరెస్ట్ చేసే క్రమంలో ఆయన భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించి, పిల్లలను భయభ్రాంతులకు గురిచేసిన బొబ్బిలి రూరల్ సీఐ కె. శ్రీనివాస్‌పై తెలంగాణలోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను కేవీఆర్ భార్య విజయలక్ష్మి పోలీసులకు సాక్ష్యాలుగా అందజేశారు. గత రెండు నెలలుగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఈ కేసులో ఏపీ పాలకులు మరికొన్ని అరెస్టులకు కూడా వ్యూహాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది.


