
సాక్షి, పార్వతీపురం మన్యం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే అర్ధరాత్రి మహిళా ఎంఆర్వోకు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అనంతరం, సదరు మహిళా ఎంఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టీడీపీ ఎమ్మెల్యే ప్లేటు ఫిరాయించారు. రివర్స్‌లో ఆమెపైనే ఆరోపణలు చేశారు.
వివరాల ప్రకారం.. పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర.. మహిళా ఎంఆర్వోకు అర్ధరాత్రి వాట్సాప్‌లో కాల్ చేశారు. ఈ క్రమంలో అసభ్య పదజాలంతో ఆమెను దూషించారు. దీంతో, సదరు మహిళా ఎంఆర్వో.. పోలీసులకు ఆశ్రయించారు. అనంతరం, టీడీపీ ఎమ్మెల్యే బోనెల.. బహిరంగంగా బ్లాక్‌మెయిల్‌కు దిగారు. సదరు అధికారి.. ఎస్టీ మహిళ కావడంతో తనపై కేసు నమోదు అవుతుందున్న భయంతో ఎంఆర్వోపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఆయన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర స్పందిస్తూ..‘భూమి విషయమై మాట్లాడేందుకు అర్ధరాత్రి ఎంఆర్వోకు నేను ఫోన్ చేశాను. ఆమె ఎత్తకపోవడంతో వాట్సాప్ కాల్ చేశాను. ఎంఆర్వో ఆఫీసు అవినీతిమయంగా తయారైంది. ఎంఆర్వో మానసిన పరిస్థితి సరిగా లేదు. ఎంఆర్వోపై శాసనసభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తా. ఆమె క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
మరోవైపు... ఎంఆర్వోతో అనుచితంగా మాట్లాడిని ఎమ్మెల్యే తీరుపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఈ సందర్బంగా సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు స్పందిస్తూ.. మహిళా ఎంఆర్వోకు అర్ధరాత్రి ఎమ్మెల్యే ఫోన్ చేయడం సరికాదు. ఆమెను వేధింపులకు గురిచేయడమేంటని ప్రశ్నించారు.