● కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి
పార్వతీపురం రూరల్: మహిళా సాధికారతలో పార్వతీపురం మన్యం జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు అందరూ కృషిచేయాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీఎన్జీజీఓ, మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శనివారం మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని పరుగు పందెం, టాగ్ ఆఫ్ వార్, షాట్‌ఫుట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆత్మవిశ్వాసంతో తమ సమస్యలపై గళమెత్తాలని, అదే వారి విజయానికి ప్రాతిపదిక అని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద మహిళా మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఒక డ్రైవ్‌లా చేపడుతున్నామని, సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని సూచించారు. మహిళా ఉద్యోగులకు రూ.4 వేల విలువైన వైద్య పరీక్షల నిర్వహణ కోసం త్వరలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి మాట్లాడుతూ.. జిల్లాలో మహిళల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ డాక్టర్ టి.కనకదుర్గ, ఏపీఎన్జీజీఓ జిల్లా అధ్యక్షుడు జి.వి.ఆర్.ఎస్.కిశోర్, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యా యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


