● వంటింట్లో సిలిండర్ మంట
● గ్యాస్ ధరలు భారీగా పెంపు
● గృహావసరాల బండపై రూ.60 భారం
సాక్షి, పార్వతీపురం మన్యం:
చమురు సంస్థలు మహిళలకు ‘కానుకిచ్చాయి’. మహిళా దినోత్సవం సందర్భంగా నెత్తిన పెద్ద ‘బండే’ వేశాయి. గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండరుపై రూ.60 (14.2 కిలోలు), వాణిజ్య సిలిండరుపై రూ.115 (19 కిలోలు) చొప్పున వడ్డించాయి. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇంధన కొరతపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న విషయం విదితమే. ఈ పరిస్థితుల్లో దీనికి ఊతమిస్తూ.. గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే స్థితి కొనసాగితే.. గ్యాస్ మరింత కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ప్రజలు భావిస్తున్నారు.
రాయితీ అంటూ..
జిల్లాలోని 15 మండలాల పరిధిలో 16 గ్యాస్ ఏజెన్సీలున్నాయి. సాధారణ, దీపం, సీఎస్‌ఆర్, ఉజ్వల యోజన సర్వీసులు కలిపి 2.72 లక్షల మంది గ్యాస్ వినియోగదారులున్నారు. సగటున నెలవారీ సుమారు 1.50 లక్షల సిలిండర్లు వినియోగమవుతాయని అంచనా. ప్రస్తుతం పెరిగిన ధరతో గృహ అవసర సిలిండర్ ధర రూ.880.50 పైసల నుంచి రూ.940.50 కానుంది. వాణిజ్య సిలిండర్ రూ.1,824 నుంచి రూ.1,968 కానుంది. ఈ లెక్కన సాధారణ గ్యాస్ వినియోగదారులపై నెలకు రూ.కోటి వరకు అదనపు భారం పడనుంది. ఉజ్వల పథకం సిలిండర్లపై భారం లేకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఓవైపు గతంలో రూ.వందల్లో ఉండే రాయితీ అమాంతం తగ్గిపోయింది. ప్రస్తుతం కేంద్రం అందిస్తున్న రాయితీ రూ.3 చొప్పునే తిరిగి బ్యాంకు ఖాతాలో జమవుతోంది. దీనివల్ల వినియోగదారులు పూర్తి మొత్తమిచ్చే సిలిండర్లు కొనుగోలు చేయాల్సి వస్తోంది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా రాష్ట్రంలోని మహిళలకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తామని ప్రస్తుత సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇది కూడా సగం మందికి అందని పరిస్థితి. గతంలో గ్యాస్ ధరలు పెరిగినప్పుడు, వినియోగదారులపై ఆ భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వాలే ఆ మొత్తం భరించేవి. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేకపోయింది.
గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్
పార్వతీపురం రూరల్: వంటగ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ పార్వతీపురం పట్టణంలో శనివారం నిరసన తెలిపారు. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌పై రూ.60, వాణిజ్య సిలిండర్‌పై రూ.115 మేర భారాన్ని మోపడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాలు నిరసన గళమెత్తాయి. పట్టణంలోని పాత బస్టాండ్, మున్సిపల్ కార్యాలయం వద్ద ప్లకార్డులతో నినదించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి గొర్లి వెంకటరమణ, పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి పాకల సన్యాసిరావు, ప్రజా సంఘాల నాయకుడు బంకురు సూరిబాబు మాట్లాడుతూ.. సామాన్యుడిపై గ్యాస్ భారం మోపడం తగదని, పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిత్యావసరాల ధరలు పెరుగుతున్న తరుణంలో ఈ పెంపు సామాన్య కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.


