‘అటు ఇటు అన్నింటా.. నువ్వే జగమంతా.. పరుగులు తీస్తావు ఇంటా బయటా!’ అని సమాజంలో మహిళల ప్రస్తుత పాత్రను వర్ణించాడు ఓ సినీ కవి. అంతగా శ్రమిస్తున్నా, ఆమెలో అలుపు రాదు.. చిరునవ్వు తప్ప! ఆమె నడిచే దారంతా వెలుగులు పూస్తాయి. అదే మహిళల గొప్పతనం. అమ్మగా.. భార్యగా.. తోబుట్టువుగా.. బిడ్డగా.. ఓ కుటుంబానికి దారి దీపం ఆమె. అన్నం పెట్టే అన్నపూర్ణ.. జీవిత పాఠాలు చెప్పే గురువు.. నాడి పట్టి ఆయువు పెంచే వైద్యురాలు.. గమ్యాన్ని చేర్చే చోదకురాలు.. అల్లరి మూకల భరతం పట్టే పోలీసు.. ఇలా సమాజంలో ఏ పాత్ర అయినా తనకు కొట్టిన పిండే. ఆమె లేని చోటు లేదు.. ఆమె చేయని పని లేదు.. ఆమె లేకుండా ఈ జగతే లేదు! అవనిని మోసే భూమాత సీ్త్ర. నేడు మహిళా దినోత్సవం. ఆమె గురించి ఈ ఒక్క రోజు కాదు.. ఏడాదంతా కేటాయించినా తక్కువే. అటువంటి ‘అతివ’రథ మహారథులపై ‘సాక్షి’ అక్షర రూపం. – సాక్షి పార్వతీపురం మన్యం/ పార్వతీపురం రూరల్
● అలుపనిఅనవే రవ్వంత.. వెలుగులు నింపుతావు దారంతా! ● అన్నింటా ఆమె.. జగమంతా ● నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
నేల తల్లిని నమ్ముకుని బతుకుతున్న గ్రామీణ మహిళలు జిల్లాలో కోకొల్లలు. వ్యవసాయ కార్మికులుగా, ఉపాధి వేతనదారులుగా, శ్రామిక మహిళలుగా శ్రమైక జీవన సౌందర్యాన్ని చాటి చెబుతున్నారు. జిల్లాలో సుమారు 2 లక్షల మంది రైతులు వ్యవసాయాన్నే నమ్ముకుని ఉంటే... అందులో సగం మంది మహిళలు చేదోడుగా ఉంటున్నారు. ఉపాధి హామీ పనుల్లోనూ వీరి భాగస్వామ్యం అధికం. జిల్లాలో 2025 సంవత్సరానికి సంబంధించి మొత్తం 4.53 లక్షల మంది వేతనదారులు ఉపాధి పనులు వినియోగించుకోగా.. ఇందులో 2.62 లక్షల మంది మహిళలే కావడం విశేషం. పార పట్టాలన్నా.. తట్ట మోయాలన్నా.. తామేమీ తక్కువ కాదని అంటున్నారు. వ్యవ‘సాయం’లో ముందుంటున్నారు. కుటుంబానికి అండగా నిలుస్తున్నారు.
జిల్లాలో ప్రజా ప్రతినిధులుగా, ఉన్నత అధికారులుగా రాణిస్తున్నారు మన వనితలు. మారుమూల కురుపాం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది, డిప్యూటీ సీఎంగా పని చేశారు పాముల పుష్ప శ్రీవాణి. సాలూరు నుంచి మంత్రి అయ్యారు గుమ్మిడి సంధ్యారాణి. సాధారణ ఉద్యోగిగా జీవితం మొదలు పెట్టి.. గిరిజన బిడ్డగా ఎమ్మెల్యే అయ్యారు విశ్వాసరాయి కళావతి. ప్రభుత్వ విప్‌గా వ్యవహరిస్తున్నారు తోయక జగదీశ్వరి. పంచాయతీ, పట్టణ ప్రథమ పౌరులుగా సమర్ధవంతమైన పాలన అందిస్తున్నారు మన అతివలు. పలువురు జిల్లా ఉన్నతాధికారులుగానూ ‘రాణి’స్తున్నారు. పార్వతీపురం సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, ఏఎస్పీ మనీషా రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి హేమలత వంటి వారు ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని, చిన్న వయసులోనే ఈ స్థాయికి వచ్చారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్‌లో తమదైన ముద్ర వేస్తున్నారు. వీరే కాదు.. జిల్లా పరిపాలనలో చూసుకుంటే ప్రతి శాఖలోనూ సగం మంది ఉద్యోగినులే ఉంటున్నారు. పాలిచ్చి పెంచే తల్లులకు పాలించడం ఓ లెక్కా!


