ఇప్పటికైనా నా బిడ్డ బూడిద ఇవ్వండి! | Take action against all those who assisted CI Nagaraju says Sai Krishna mother | Sakshi
Sakshi News home page

ఇప్పటికైనా నా బిడ్డ బూడిద ఇవ్వండి!

Jun 25 2026 4:59 AM | Updated on Jun 25 2026 4:59 AM

Take action against all those who assisted CI Nagaraju says Sai Krishna mother

కర్మకాండలు చేసుకుంటా

సీఐ నాగరాజుకు సహకరించిన వారందరిపైనా చర్యలు తీసుకోండి 

సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి

లబ్బీపేట(విజయవాడ తూర్పు): ‘నా కొడు­కును చూపిస్తామన్న పోలీసులు చివరకు చంపేసి శ్మశానంలో కాల్చేశారు. ఇప్పటికైనా నా బిడ్ద బూడిద ఇవ్వండి. కర్మకాండలు చేసుకుంటా’ అని విజయవాడలోని కృష్ణలంకకు చెందిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన కొడుకుని పోలీస్‌ కస్టడీలోనే కొట్టి చంపారన్నది నిజమైందని, తాను మొదటి నుంచి అదే చెబుతున్నానని అన్నారు. సీఐ నాగరాజుతో పాటు ఆయనకు సహకరించిన మిగతా వారందరిపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. 

తమ బిడ్డను స్టేషన్‌లోనే కొట్టి చంపేసి మూటకట్టి శ్మశానానికి తీసుకెళ్లి కాల్చేశారని, కనీసం బూడిద కూడా ఇవ్వలేదని, ఇదేమైనా న్యాయంగా ఉందా అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ‘ఈరోజు నేను కుమిలిపోతున్నాను. నా బిడ్డ ఎక్కడ. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఇంత అన్యాయం చేశారు పోలీసులు. నా బిడ్డను అంత చిత్రవధ చేసి చంపిన వాళ్లందరికీ శిక్ష పడాలి. అందరూ కలిసి కొట్టి కొట్టి చంపేశారు. నన్ను స్టేషన్‌కు కూడా రానివ్వకుండా వాడిని ఎక్కడికో తీసుకెళ్లి హతమార్చారు. అలా చేయాల్సిన  అవసరం ఏమొచి్చంది. వాడి వయసెంత. మీ పోలీసుల వయసెంత. అంత చిన్న బిడ్డను చిత్రవధ చేశారు. వాళ్లకు తగిన శిక్ష పడాలి. నాకు అదే కావాలి’ అని వాపోయారు. మీడియాను చూపిస్తూ ‘నాకు మీరే న్యాయం చేయాలి’ అని వేడుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement