సాక్షి, విశాఖ: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సాయి కృష్ణ కేసులో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్‌గా ఐజీ రవి ప్రకాష్ ఉండగా.. సభ్యులుగా పశ్చిమగోదావరి ఎస్పీ అద్నాన్ నయీం షమీ, అల్లూరు సీతారామరాజు ఎస్పీ అమిత్ బార్డర్, బాపట్ల అడిషనల్ SP ఎల్ సుధాకర్‌ని నియమించింది. విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ మే 9న అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఆయనను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని, హింసించి చంపేశారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
కాగా సాయికృష్ణ మిస్సింగ్ కేసు వ్యవహారం పూటకో మలుపు తిరుగుతోంది. దర్యాప్తులో భాగంగా కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికకు వెళ్లిన అధికారులు.. అక్కడ పని చేసే బాషా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సాయికృష్ణను లాకప్‌డెత్ చేసిన అనంతరం ఇక్కడే ఖననం/అంత్యక్రియలు చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గాదె సాయికృష్ణ కేసు దర్యాప్తు నేపథ్యంలో పోలీసులు చేపట్టిన తనిఖీలు శనివారం విజయవాడ కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికలోని అనుమానాస్పద వ్యవహారాలను బయటకు తెచ్చాయి. అనాధ మృతదేహాల నిర్వహణలో నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలతో ఎలక్ట్రికల్ ఫర్నెస్ ఆపరేటర్ బాషాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
కృష్ణలంక స్వర్గపురిలో సాయంత్రం 6 గంటల తర్వాత దహనాలు నిర్వహించకూడదన్న నిబంధన అమల్లో ఉంది. అయితే మే నెల 23వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో రెండు అనాధ మృతదేహాలను అక్కడికి తీసుకువచ్చినట్లు తేలింది. అప్పటికే సమయం ముగిసిందని దహనానికి అవకాశం లేదని ఇంచార్జి బాషా చెప్పినప్పటికీ, పరిస్థితుల నేపథ్యంలో పోలీసుల సూచనలతో మృతదేహాలను తాత్కాలికంగా అక్కడే నిల్వచేసినట్లు సమాచారం. అనంతరం 24వ తేదీ ఉదయం దహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ వ్యవహారం.. గాదె సాయికృష్ణ కేసుతో అనుసంధానంగా బయటపడినట్లు తెలుస్తోంది. అనాథ మృతదేహాల దహనానికి సంబంధించిన ప్రొసీజర్‌ను పూర్తిగా పాటించారా లేదా? రికార్డులు సక్రమంగా నిర్వహించారా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. దహనాలు, ఖననాల ముందు తప్పనిసరిగా నిర్వహించాల్సిన రికార్డులు, కృష్ణలంక పోలీసులు ఇచ్చిన అనుమతులు సరైన విధంగా ఉన్నాయా? అసలు ఆ అనుమతులు ఎవరు ఇచ్చారు? అనే విషయాల్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.


