
సాక్షి, గుంటూరు: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ విషయంలో పోలీసుల తీరుపై మంగళగిరి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ఈ కేసుకు ఎలా వర్తిస్తుంది? అని ప్రశ్నించింది. గతంలో ఓసారి చెప్పినా మళ్లీ ఇవే సెక్షన్లు ఎలా పెడతారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ డీఎస్పీ, ఎస్పీకి మెమో జారీ చేస్తామని హెచ్చరించింది. అదే సమయంలో..

కొమ్మినేనిపై నమోదు అయిన ఎస్సీ, ఎస్టీ యాక్ట్, 356(2) సెక్షన్స్‌ను జడ్జి తొలగించారు. ఆపై కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ని గుంటూరు జైలుకు తరలించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు మఫ్టీలో హైదరాబాద్‌కు వచ్చి మరీ సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును సోమవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 70 ఏళ్ల వయస్సున్న కొమ్మినేనిపై అక్రమ కేసులు బనాయించి మరీ చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు దిగిందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్, ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు మండిపడుతున్నారు. పలువురు జర్నలిస్టులు, మేధావులు సైతం కొమ్మినేని అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నారు.
మరోవైపు.. కొమ్మినేనిని రాత్రంతా నల్లపాడు పీఎస్‌లోనే ఉంచారు పోలీసులు. కొమ్మినేనిని అడ్వకేట్లు కలవకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై న్యాయవాదుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉదయం జీజీహెచ్‌లో వైద్యపరీక్షలు అన్నీ పూర్తయ్యాక మంగళగిరి కోర్టులో హాజరు పరిచారు.

కొమ్మినేని అరెస్టుపై జర్నలిస్టుల నిరసనలు
సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని అరెస్ట్‌ను నిరసిస్తూ ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులు నిరసనలకు దిగారు. నల్ల జెండాలతో ర్యాలీలతో పాటు నినాదాలు చేశారు. బేషరతుగా కొమ్మినేనిని విడుదల చేయాలని, ఏపీ ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను హరిస్తోందని విమర్శించారు.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది
అల్లూరి సీతారామరాజు జిల్లా: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్టును ఎమ్మెల్సీ అనంత బాబు ,మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మిలు ఖండించారు. కక్షపూరితంగా కొమ్మినేని అరెస్ట్ చేశారన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని విమర్శించారు.
కొమ్మినేని అరెస్టు దుర్మార్గం
సాక్షి, అమరావతి: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు దుర్మార్గం, కక్షపూరితమని, సాక్షి మీడియాను టార్గెట్ చేసిన సీఎం చంద్రబాబు, నిజాయితీగా పని చేసే జర్నలిస్టును వేధించడం దారుణమని వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జర్నలిస్ట్ కృష్ణంరాజు వ్యాఖ్యలతో ‘సాక్షి’కి సంబంధం లేకపోయినా వైఎస్ జగన్‌ను, ఆయన సతీమణి భారతిని తిట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కూటమి పాలన వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే కొమ్మినేనిని అరెస్టు చేశారని విమర్శించారు.
కొమ్మినేని అరెస్టు అక్రమం
అనంతపురం కార్పొరేషన్: సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ అరెస్టు అక్రమమని వైఎస్సార్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు.ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ..రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కొమ్మినేనిని అరెస్టు చేయించారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం ఈ అంశాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డారు. సాక్షి మీడియాపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోని పోలీసులు, కొమ్మినేని విషయంలో మాత్రం ఆగమేఘాలపై స్పందించడం రాజకీయ కుట్రలో భాగమేనని ఆరోపించారు.
విశ్లేషకుల వ్యాఖ్యలను ‘సాక్షి’కి ఆపాదించకూడదు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిఫై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విశ్లేషకుల అభిప్రాయాలను సాక్షి మీడియాకు ఆపాదించడం సరైనది కాదని సెంటర్ ఫర్ పొలిటికల్ స్ట్రాటజీ అండ్ రీసెర్చ్ (సీపీఆర్‌ఎస్) చీఫ్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ మామిడి సుదర్శన్ అన్నారు. గతంలో ఈనాడులో వచి్చన పలు వ్యాసాలపై ఆ పత్రిక అధినేత రామోజీరావు మీద కోర్టులో పరువు నష్టం దావా వేసినప్పుడు రామోజీరావు ఇదే విషయాన్ని కోర్టుకు నివేదించారని తెలిపారు. పేపర్‌లో రాసే వ్యాసాలు, విశ్లేషణలు రాసిన వారి వ్యక్తిగత అభిప్రాయాలే తప్ప, ఈనాడుకు ఏ సంబంధంలేదని హైకోర్టుకు రామోజీరావు నివేదించారని సోమవారం ఒక ప్రకటనలో ఆయన గుర్తుచేశారు. సాక్షి టీవీ చర్చలో అమరావతిపై విశ్లేషకుడి అభిప్రాయం ఆయన వ్యక్తిగతమని, దీనితో సాక్షికి సంబంధంలేదని స్పష్టం చేశారు.

జర్నలిస్టులను అణిచివేతకే అక్రమ అరెస్ట్‌లు
తిరుపతి మంగళం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కక్ష సాధింపులు, రెడ్‌బుక్ పాలన, అక్రమ కేసులు బనాయించి గిట్టనివాళ్లను జైళ్లకు పంపడమే పనిగా పెట్టుకుందని వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తున్న సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం దాడులకు తెగబడుతూ అక్రమ అరెస్ట్‌లు చేయడం బాధాకరమన్నారు. జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేయడం, పత్రికా కార్యాలయాలపై దాడులు చేయడం చరిత్రలో ఎన్నడూ లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘కొమ్మినేని’ అరెస్టు కక్ష సాధింపే..
హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేయడాన్ని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్‌డబ్ల్యూజే), తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) తీవ్రంగా ఖండించాయి. ఇది పోలీసుల కక్ష సాధింపు చర్యలో భాగమని ఐఎఫ్‌డబ్ల్యూజే కార్యదర్శి పులిపలుపుల ఆనందం, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షుడు పిల్లి రాంచందర్ తదితరులు సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్‌లో కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు సందర్భంగా వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉందని తెలిపారు.