సీడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన ఏపీ, తెలంగాణ అధికారులతో ఏర్పాటు
కమిటీ సభ్యులుగా కృష్ణా,గోదావరి బోర్డుల చైర్మన్‌లు
వివాదాల పరిష్కారానికి మూడు నెలల్లోగా నివేదిక
కేంద్ర జల్ శక్తి శాఖ ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. ఈమేరకు ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కమిటీని నియమిస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ సంజయ్ కుమార్‌సింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సలహాదారుడు, ఈఎన్‌సీ(ఇరిగేషన్), అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్ ఇంజనీర్ ఉంటారు.
తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారుడు, శాఖ ముఖ్యకార్యదర్శి, ప్రత్యేక కార్యదర్శి, ఈఎన్‌సీ (జనరల్)తోపాటు కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్‌లు, జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) సీఈలను సభ్యులుగా నియమించారు. సీడబ్ల్యూసీలో ప్రాజెక్టుల మదింపు విభాగం(పీఏవో) సీఈని కమిటీ సభ్య కార్యదర్శిగా నియమించారు. కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన గతేడాది జూలై 16న ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో కమిటీని నియమించి సంప్రదింపుల ద్వారా జల వివాదాలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు.
ఆ మేరకు ఇప్పుడు కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. కృష్ణా, గోదావరి జలాల పంపిణీ, వినియోగంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై సమగ్రంగా అధ్యయనం చేసి సమన్యాయంతో నీటి పంపకాల మార్గాలను సూచించేందుకు కమిటీని ఏర్పాటు చేసినట్లుగా కేంద్రం పేర్కొంది. జల వివాదాల పరిష్కారానికి మూడు నెలలులోగా నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది. ఇందుకోసం ఇతర విభాగాల అధికారులు, నిపుణుల సేవలను వినియోగించుకోవాలని సూచించింది.
పరిష్కారమయ్యేనా..?
కృష్ణా జలాలను ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299 టీఎంసీలను కేటాయిస్తూ 2015లో కేంద్రం తాత్కాలిక సర్దుబాటు కల్పించింది. అయితే కృష్ణా నదీ జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడి అమలులోకి వచ్చే వరకు, బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాల్లో తమకు 50 శాతం నీటిని కేటాయించాలని తెలంగాణ సర్కార్ డిమాండ్ చేస్తోంది. గోదావరిపై ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం–బనకచర్ల/నల్లమలసాగర్‌పై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. కృష్ణా, గోదావరి బేసిన్‌లలో రెండు రాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టులపై పరస్పరం కేంద్రానికి ఫిర్యాదు చేసుకున్నాయి. ఈ వివాదాలపై చర్చించి పరిష్కారాలను సూచిస్తూ కేంద్రానికి కమిటీ ఇచ్చే నివేదికతోనైనా జల వివాదాలు పరిష్కారమవుతాయా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.


