ప్రజల ఆకాంక్ష మేరకే ప్రభుత్వ పాలన
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని
గుంటూరువెస్ట్: ప్రజల ఆకాంక్షల మేరకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్‌న్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్ట్ కింద పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పెమ్మసాని మాట్లాడుతూ శనివారం నుంచి 9వ తేదీ వరకు గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించి 35,690 పట్టాదారు పుస్తకాల పంపిణీ చేస్తామన్నారు. భూ రికార్డుల వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలేనని తెలిపారు. సంస్కరణల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇన్సెంటివ్ ప్రోగ్రామ్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచి, ఇప్పటివరకు రూ.490 కోట్ల ఇన్సెంటివ్స్ పొందిందని చెప్పారు. పట్టణాల్లో పైలట్ ప్రోగ్రాంగా భూ సర్వేలు జరుగుతున్నాయని, గుంటూరు, మంగళగిరి నగరాలు ఇందులో భాగమని, జిల్లాలో ఇప్పటికే 30 గ్రామాల్లో ఈ కార్యక్రమం పూర్తయిందని, మిగిలిన గ్రామాల్లో కూడా మూడు నుంచి నాలుగు నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. రైతులకు మనశ్శాంతి, భూమిపై పూర్తి భరోసా కల్పించడమే ఈ సంస్కరణల ఉద్దేశమని పేర్కొన్నారు. అనంతరం పెమ్మసాని, ఎమ్మెల్యేతో కలసి రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు, సర్వే సెటిల్‌మెంట్ అండ్ ల్యాండ్ రెవెన్యూ డైరెక్టర్ కూర్మనాధం, సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, నగర మేయర్ కోవెలమూడి రవీంద్రబాబు, కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా లతో కలసి పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఆర్వో షేఖ్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.


