ప్రపంచ తెలుగు మహాసభలకు భారీ బందోబస్తు
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): గుంటూరు–ప్రత్తిపాడు ప్రధాన మార్గంలో హైవే పక్కన ఉన్న శ్రీసత్యసాయి స్పిరిచ్యువల్ సిటీలో ఈనెల 3, 4, 5 తేదీల్లో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించి బందోబస్తు ఏర్పాట్లను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఇంటెలిజెన్స్ ఎస్పీ ఆరీఫ్‌హఫీజ్ పరిశీలించారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగే సభల్లో పాల్గొనేందుకు మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్‌బీర్ గోకుల్, ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్న నేపథ్యంలో బందోబస్తును పరిశీలించారు. శనివారం సాయంత్రం గుంటూరులోని ఐటీసీ వెల్‌కమ్ హోటల్‌కు మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్‌బీర్ గోకుల్ రానున్నారు. తెలుగు మహాసభలకు హాజరై అనంతరం మంగళగిరిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో వీవీఐపీ ప్రొటోకాల్‌కు అనుగుణంగా బందోబస్తు, పోలీసు ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. భద్రత లోపాలకు తావులేకుండా జాగ్రత్తలు పాటిస్తున్నట్లు తెలిపారు. వీవీఐపీల రాక నేపథ్యంలో పర్యటనలో అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముగిసేలా కట్టుదిట్ట చర్యలు చేపట్టినట్లు అధికారులు వివరించారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.


