పన్నులు, పన్నేతర ఆదాయం గణనీయంగా పెరిగేలా చర్యలు సూచించండి
బకాయిల వసూళ్ల కోసం హెచ్‌ఓడీలు డ్రైవ్ చేపట్టాలి
ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తగ్గించండి..
మూలధన వ్యయానికి పీపీపీ, ఈఏపీ, నాబార్డు, హడ్కో నిధులు
ఈనెల 9లోగా బడ్జెట్ ప్రతిపాదనలను నిధి పోర్టల్‌లో ఇవ్వాలి
ఫిబ్రవరిలో 2026–27 రాష్ట్ర వార్షిక బడ్జెట్ కోసం అన్ని శాఖలకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పన్నేతర రాబడిని గణనీయంగా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రభుత్వ విభాగాలకు సూచించింది. గత కొన్నేళ్లుగా పన్నేతర ఆదాయంలో పెరుగుదల లేదని, ఇందుకు ప్రధాన కారణం పరిపాలన విభాగాలు క్రమానుగతంగా చార్జీలను సవరించకపోవడంతో పాటు పర్యవేక్షణ లేకపోవడమని తెలిపింది. పన్ను రాబడులు పెంచేందుకు సంబంధిత శాఖలు ప్రస్తుత పన్ను రేట్ల ఆధారంగా ప్రతిపాదనలు సమర్పించాలని కోరింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రస్తుత ఆర్థిక ఏడాది సవరించిన అంచనాల సమర్పణకు సమగ్ర సూచనలు చేస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోజ్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.
ఫిబ్రవరిలో 2026–27 వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీకి సమర్పించనున్నట్లు అందులో తెలిపారు. బడ్జెట్ ప్రతిపాదనలను నిధి ఆన్‌లైన్ పోర్టల్‌లో ఈనెల 9లోగా ఆన్ని శాఖలు ఆర్థిక శాఖకు సమర్పించాలన్నారు. ఈ నేపథ్యంలో.. ఇప్పుడున్న దానికంటే పన్నేతర ఆదాయం పెంచేందుకు అన్ని శాఖలూ నిర్దిష్ట కార్యాచరణ రూపొందించాలి్సందిగా సూచించారు. వివిధ రకాల వడ్డీలు, డివిడెండ్లు రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలని, పరిపాలన విభాగాల్లో పటిష్టమైన పర్యవేక్షణతో లక్ష్యాలను సాధించాలని కోరింది. హెచ్‌ఓడీలు బకాయిల వసూళ్లపై డ్రైవ్ చేపట్టాలన్నారు. ప్రస్తుత సంవత్సరంలో వసూలయ్యే అవకాశమున్న బకాయిలను అంచనా వేయాలని.. రాబడుల్లో లీకేజీలను అరికట్టడానికి చర్యలు చేపట్టడంతోపాటు కఠినమైన నిఘాతో అన్ని స్థాయిల్లో ఉద్యోగుల పనితీరును మెరుగుపర్చి సూచికలను అమలుచేయాలని తెలిపింది.
కొత్తగా ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ప్రతిపాదించొద్దు..
ప్రస్తుతమున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందిని సమీక్షించడం ద్వారా వారి సంఖ్య తగ్గించాలని, కొత్తగా ఎవరినీ ప్రతిపాదించొద్దని.. అలాగే ప్రాజెక్టులు, పథకాలకు సంబంధించిన సిబ్బంది వేతనాలకు మంజూరైన ఉత్తర్వుల ఆధారంగా ఒప్పంద సేవలకు అవసరమైన నిధులు ప్రతిపాదించాలని ఆర్థిక శాఖ తెలిపింది. సంబంధిత శాఖల ఆమోదం తరువాతే కన్సల్టెంట్స్, రిటైర్డ్ ఉద్యోగుల పునర్నియామకాలకు వేతనాలను ప్రతిపాదించాలని పేర్కొంది. గత మూడేళ్ల వ్యయం ఆధారంగా నిర్వహణ వ్యయం ప్రతిపాదించాలంది. ప్రభుత్వ అనుమతిలేని ఎలాంటి అంశాలకూ కేటాయింపులు ప్రతిపాదించరాదని చెప్పింది. రాయితీలు, నిర్వహణ, సామాజిక పింఛన్లు మొదలైన తప్పనిసరి వ్యయాలకు పూర్తిగా కేటాయింపులు చేస్తామని.. అయితే, లబ్ధిదారుల సంఖ్యతో సహా బడ్జెట్ ప్రతిపాదనలు చేయాలి.
అప్పులతోనే మూలధన వ్యయం..
ఇక మౌలిక సదుపాయాల మూలధన వ్యయానికి అప్పులపైనే ఆధారపడాలని ఆర్థిక శాఖ స్పష్టంచేసింది. కనెక్టివిటీ, గృహ నిర్మాణం, తాగునీరు, విద్య, ఆరోగ్యంతో పాటు పారిశ్రామీకరణ వంటి మూలధన వ్యయ వనరుల ప్రతిపాదనలను పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ), ఈఏపీ, నాబార్డు, హడ్కోల నుంచి నిధులు రాబట్టేలా సంబంధిత ఇంజనీర్లు పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో సమర్పించాలని తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలను సమీక్షించడంతో పాటు వాటి అవసరం, ప్రాధాన్యత, వ్యయాలు, ఫలితాలను పరిశీలించి కాలం చెల్లిన పథకాలను రద్దుచేయాలని చెప్పింది. వేతనాలేతర వ్యయంలో 20 శాతం పొదుపు చేయాలని కోరింది. సాధ్యంకాని, సరిపోని కేటాయింపుల ప్రతిపాదనలను చెయొ్యద్దని ఆర్థిక శాఖ ఆ ఉత్తర్వుల్లో తేల్చిచెప్పింది.
పథకాల వ్యయం అంచనాలు ఇలా..
‘పథకాల వ్యయానికి సంబంధించి ప్రతిపాదనలు సమర్పించడానికి ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. మేనిఫెస్టో పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పూర్తి డేటాతో సంబంధిత శాఖల అధికారులు సమీక్షించాకే ప్రతిపాదనలు పంపాలి. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ప్రతిపాదనలు కేంద్రానికి పంపే ముందు కూడా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. రాష్ట్ర పథకాలు, సంక్షేమ పథకాల లబ్ధిదారుల అర్హతలను సంబంధిత శాఖల అధికారులు సమీక్షించాలి. కేంద్ర ప్రాయోజిత పథకాలకు గత ఏడాది వాస్తవ నిధుల విడుదల ఆధారంగా ప్రతిపాదనలు ఉండాలి. ఊహాజనిత గణాంకాలతో ప్రతిపాదనలు చెయొ్యద్దు. ఉప ప్రణాళికలతో పాటు మహిళలు, పిల్లల బడ్జెట్‌ను ప్రతిపాదించాలి. బడ్జెట్ ప్రతిపాదనలతో పాటు సంబంధిత డాక్యుమెంట్లు, ఉత్తర్వులను శాఖాధిపతులు, సచివాలయ శాఖలు సమర్పించాలి’ అని ఆర్థిక శాఖ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.


