బదిలీల తర్వాతే హింస! | Sakshi
Sakshi News home page

బదిలీల తర్వాతే హింస!

Published Fri, May 17 2024 9:44 AM

Report To Central Election Commission On Andhra Pradesh Violence During Elections

కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించిన సీఎస్, డీజీపీ

ఏపీలో పోలింగ్, తర్వాత చోటు చేసుకున్న ఘటనలపై వివరణ

కౌంటింగ్‌ రోజు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈసీ సూచన

సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్ర­దేశ్‌లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌­రెడ్డి, డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందచేశారు. పోలింగ్‌ రోజు, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు జరగడానికి కార­ణాలను నివేదించారు. ఈసీ ఆదేశాల మేరకు ఢిల్లీ వచ్చిన వారిద్దరూ గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌(సీఈసీ) రాజీవ్‌­కుమార్, కమిషనర్లు జ్ఞానేష్‌ కుమార్, సుఖ్‌బీర్‌సింగ్‌ సంధూలతో సమావేశమయ్యారు. దాదాపు 30 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో అల్లర్లకు కారణాలను విశ్లేషించారు.

అధికారుల బదిలీ తర్వాతే అల్లర్లు..
సమస్యాత్మక ప్రాంతాలైన పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రిని దృష్టిలో ఉంచుకుని ముందుగానే భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీఎస్‌ జవహర్‌రెడ్డి ఈసీకి తెలిపారు. హఠాత్తుగా పోలీసు అధికారు­లను బదిలీ చేయడం, కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వారికి క్షేత్రస్థాయి పరిస్థితులపై పూర్తి అవగా­హన లేకపోవడం వల్ల అల్లర్లకు దారి తీసిందని తాము గుర్తించినట్లు పేర్కొన్నారు. పోలింగ్‌ రోజు, మరుసటి రోజు పల్నాడు,  కారంపూడి, మాచవరం, తాడిపత్రి, తిరుపతి, చంద్రగిరి, అనంతపురం, కృష్ణా జిల్లా, నర్సీపట్నం తదితర చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నట్లు చెప్పారు. ఎస్పీ స్థాయి అధికారి నుంచి ఎస్‌ఐ వరకు హఠాత్తుగా బదిలీలు చేయడంతో ఇదే అదునుగా అల్లర్లకు పాల్పడినట్లు వివరించారు. అల్లర్లు జరిగిన ప్రాంతాలన్నింటిలోనూ పోలీసు అధికారుల ఆకస్మిక బదిలీలే హింసకు కారణమని పేర్కొన్నట్లు తెలిసింది.

కౌంటింగ్‌ రోజు జాగ్రత్త..
రాష్ట్రంలో ఇకపై ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్, డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అల్లర్లకు కారకులపై కఠినంగా వ్యవహరించాలని సూచించింది. జూన్‌ 4న కౌంటింగ్‌ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పటిష్ట బందోబస్తు కల్పించాలని పేర్కొంది. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేయాలని, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే పోలీసు అధికారులు, సిబ్బందిపై వేటు తప్పదని హెచ్చరించినట్లు సమాచారం. ఎస్పీ స్థాయి అధికారి నుంచి హోంగార్డు వరకు ప్రతి ఒక్కరూ శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ఉందని, దీనిపై నిశితంగా పర్యవేక్షించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ సూచించినట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement