రాధా గాయత్రి మృతిపై మరో ట్విస్ట్‌ | Radha Gayatri Parents Allegations On Husband Sricharan | Sakshi
Sakshi News home page

రాధా గాయత్రి మృతిపై మరో ట్విస్ట్‌

Jun 18 2026 1:45 PM | Updated on Jun 18 2026 4:46 PM

Radha Gayatri Parents Allegations On Husband Sricharan

సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో విశాఖపట్నానికి చెందిన యువతి రాధా గాయత్రి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న గాయత్రి తల్లిదండ్రులు గురువారం విశాఖపట్నం పోలీస్ కమిషనర్ (సీపీ) కార్యాలయానికి చేరుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. గాయత్రి మృతి సహజ మరణం కాదని, ఈ ఘటన వెనుక అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా తమ అల్లుడి పాత్రపై అనుమానం ఉందని, పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మృతిపై అనుమానాలు ఉన్నాయి..
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గాయత్రి తల్లి సత్యవతి.. తమ కుమార్తె మరణానికి సంబంధించి తమకు అనేక సందేహాలు ఉన్నాయని చెప్పారు. ఘటన జరిగిన తీరుపై స్పష్టత లేదని, అందుకే పోలీసుల జోక్యం కోరుతున్నామని తెలిపారు. తన అల్లుడు శ్రీచరణ్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. తమకు అందిన సమాచారం, శ్రీచరణ్‌ చెప్పిన కారణాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని పేర్కొంటూ ఈ కేసును అన్ని కోణాల్లో విచారించాలని కోరారు. తన కూతురుతో తమ అల్లుడు సరిగా కలిసి ఉండే వారు కాదని అన్నారు. తమ కూతురికి మద్యం సేవించే అలవాటు లేదు. గాయత్రిపై అనుమానంతోనే హత్య చేసి ఉండొచ్చు. రిషికేశ్, హరిద్వార్ వెళ్తున్నామని చివరి సారిగా నాకు చెప్పింది. విహారయాత్ర ముగించుకొని విశాఖకు వస్తానని చెప్పింది. విశాఖకు రాకుండానే నా కూతుర్ని హతమార్చారు. విశాఖకు వచ్చిన తర్వాత రెండు నెలలు వర్క్‌ ఫ్రం హోం పెట్టి ఇక్కడే ఉంటాను అని చెప్పింది. మాది సాంప్రదాయమైన కుటుంబం అని ఆవేదన వ్యక్తం చేశారు

అల్లుడిపైనే అనుమానం, రాధా గాయత్రి మృతిపై మరో ట్విస్ట్‌

సీపీ కార్యాలయంలో ఫిర్యాదు..
గాయత్రి తల్లిదండ్రులు సీపీ కార్యాలయంలో అధికారులను కలిసి తమ అనుమానాలను వివరించినట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించి, అవసరమైతే సంబంధిత రాష్ట్ర పోలీసులతో సమన్వయం చేసుకుని దర్యాప్తు చేపట్టాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ముస్సోరిలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. యువతి మృతి వెనుక అసలు కారణాలేమిటి? కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్న అనుమానాలకు ఆధారాలున్నాయా? అనే అంశాలపై దర్యాప్తు కీలకంగా మారింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement