సీతంపేట: పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తూనే కార్మికుల చట్టబద్ధ హక్కుల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని విశాఖపట్నం జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ దినేష్ కుమార్ తెలిపారు. విశాఖ నగర పరిధిలోని ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు చెల్లిస్తున్న వేతనాలు, ఇతర చట్టబద్ధ ప్రయోజనాలపై కార్మిక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఓ సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు చట్టప్రకారం చెల్లించాల్సిన కనీస వేతనం కంటే తక్కువగా వేతనాలు ఇస్తున్నట్లు గుర్తించారు. దీంతో కార్మికులకు రావాల్సిన వేతన వ్యత్యాసాన్ని అధికారులు లెక్కించి, విషయాన్ని సంబంధిత యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. కార్మిక శాఖ సూచనలకు స్పందించిన యాజమాన్యం నిబంధనల ప్రకారం 8 మంది కార్మికులకు రూ.1,26,203 వేతన వ్యత్యాసాన్ని చెల్లించింది.


