మంత్రి నారాయణ బరితెగింపు | Ponguru Narayana holds meeting with booth level officers against rules | Sakshi
Sakshi News home page

మంత్రి నారాయణ బరితెగింపు

Jun 24 2026 4:59 AM | Updated on Jun 24 2026 4:59 AM

Ponguru Narayana holds meeting with booth level officers against rules

బీఎల్‌ఓలకు ‘సర్‌’పై దిశానిర్దేశం.. కార్పొరేషన్‌లోనే సమీక్ష  

ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు విరుద్ధంగా హాజరైన కమిషనర్, బీఎల్‌ఓలు, అధికారులు 

సర్‌లో రసీదులు ఇవ్వకుండా ప్రతిపక్షాల ఓట్లు తొలగించడానికి అధికార కుట్ర?

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మంత్రి పొంగూరు నారాయణ నిబంధనలకు విరుద్ధంగా బూత్‌ లెవల్‌ ఆఫీసర్ల (బీఎల్‌ఓలు)కు సమావేశం నిర్వహించడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మంత్రి నారాయణ సోమవారం సాయంత్రం కార్పొరేషన్‌లో బీఎల్‌ఓలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాజకీయ పార్టీల నాయకులు, అధికార పార్టీ నేతలు ఇలా బీఎల్‌ఓలతో సమీక్షించడం నిబంధనలకు వ్యతిరేకం. 

ఒకవేళ నిర్వహించినా ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఉద్యోగులు, అ«ధికారులు హాజరుకాకూడదు. అయితే మంత్రి సూచనతో ఏకంగా కార్పొరేషన్‌ కార్యాలయానికి బీఎల్‌ఓలు తరలివచ్చారు. కమిషనర్‌ నందన్‌తోపాటు ఇతర అధికారులు, ఉద్యోగులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి ఆదేశాలకు భయపడి సమావేశానికి హాజరుకావాల్సి వచ్చిందని కొందరు బీఎల్‌ఓలు చెప్పడం గమనార్హం.  

ప్రతిపక్షాల ఓట్లు తొలగించేందుకు కుట్ర? 
ఈ సర్‌ ప్రోగ్రాంను మంత్రి నారాయణ అవకాశంగా మలుచుకున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. నెల్లూరు నగరంతోపాటు, నెల్లూరు రూరల్‌లో ప్రతిపక్షాలకు చెందిన ఓట్లను, కచ్చితంగా తమకు ఓట్లు వేయరని అనుకున్న వారి ఓట్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోందనే ప్రచారం ఊపందుకుంది. అందులో భాగంగానే మంత్రి నారాయణ బరితెగించి బీఎల్‌ఓలతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. 

కాగా, 80 శాతానికిపైగా బీఎల్‌ఓలు ఓటర్లకు కేవలం ఒక ఫారం మాత్రమే ఇస్తున్నారు. దీంతో ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేయకపోతే అడిగేందుకు ఓటరు దగ్గర ఎలాంటి రశీదు (ఎక్నాలెడ్జ్‌మెంట్‌) ఉండదు. ఓటు తీసేసినా అడగలేని పరిస్థితి వస్తుంది. దీని వెనుక మంత్రి నారాయణ వంటి వారి హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా ఓటరుకు రెండో ఫారం (ఎకనాలెడ్జ్‌మెంట్‌) ఇవ్వాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. 

బీఎల్‌ఓలను తక్షణమే సస్పెండ్‌ చేయాలి 
బీఎల్‌ఓలతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించడం నిబంధనలకు వ్యతిరేకం. ఇలాంటి సమీక్షలు నిర్వహించేటప్పుడు కమిషనర్‌ అడ్డుచెప్పాల్సి ఉంది. మంత్రికి భయపడి మిన్నకుండిపోవడం చట్టాన్ని ఉల్లంఘించడమే. సమావేశానికి హాజరైన బీఎల్‌ఓలను తక్షణమే సస్పెండ్‌ చేయాలి. మేయర్, డిప్యూటీ మేయర్, అధికార పార్టీలకు చెందిన నేతలతో కూర్చుని ప్రతిపక్షాల ఓట్లు తొలగించేందుకు కుట్ర పన్నడమే ఈ సమీక్ష ఉద్దేశం. దీనిపై కలెక్టర్‌కు సమాచారమిచ్చాం. కమిషనర్‌ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. – పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ నెల్లూరు నగర సమన్వయకర్త 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement