వాస్తవానికి ఆస్పత్రికి డాక్టర్లు ఉదయం ఎనిమిదికే రావాలి. గంట పాటు రౌండ్స్ వేసి ఇన్‌పేషెంట్లను చూసి ఓపీలకు తొమ్మిదింటికి రావాల్సి ఉంది. అయితే సీనియర్ వైద్యుల్లో అతి కొద్ది మందే ఓపీలకొస్తున్నారు. ఎక్కువ శాతం మంది పత్తా ఉండరు. పది గంటల తర్వాత తీరిగ్గా వచ్చి, చుట్టపు చూపుగా గంటో.. రెండు గంటలో ఓపీ సేవలందిస్తారు. రక్త, ఎక్స్‌రే, ఎకో, అబ్డామిన్ లాంటి పరీక్షలు రాస్తారు. అయితే రిపోర్టులొచ్చేలోపే మళ్లీ అదృశ్యమవుతారు. ఫలితంగా జూనియర్ డాక్టర్లందించే వైద్యమే రోగులకు దిక్కవుతోంది. ఇక సూపర్ స్పెషాల్టీలో న్యూరో సర్జన్లు, కేన్సర్ విభాగ డాక్టర్లు ఎప్పుడోస్తారో.. రారో సైతం ఎవరికీ తెలియదు. వారి ఓపీ విభాగాలు ఖాళీగా దర్శనమిస్తుంటాయి. ఫలితంగా నాణ్యమైన వైద్యం మృగ్యమవుతోంది.


