● బస్తా కాయలు రూ.ఐదు వేలు
● తగ్గిన దిగుబడి ● రేట్లు మరింత పెరిగే అవకాశం
పొదలకూరు: నిమ్మ ధరలు పెరిగాయని సంతోషపడాలో.. లేక దిగుబడి లేక బాధపడాలో అర్థం కాని పరిస్థితి రైతుల్లో ఏర్పడింది. ఇటీవల నిమ్మ ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా కిలో రూ.30 నుంచి రూ.70 వరకు ఎగబాకాయి. బస్తా కాయలను మార్కెట్లో రూ.ఐదు వేలకుపైగా విక్రయిస్తున్నారు. అయితే తోటల్లో దిగుబడులు తగ్గి, కాయల అవసరం పెరిగి రేట్లు పెరుగుతున్నాయని తెలుస్తోంది. నెలాఖరు నాటికి మరింత ఎగబాకే అవకాశం ఉంది. రేట్లు పతనమై కిలో కాయలు రూ.15కు విక్రయం కాని పరిస్థితి వస్తుందని జిల్లా స్థాయి అధికారులు ముందస్తుగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే పండగల సీజన్‌తో కొంత ఊపిరిపోసుకున్నా, ఇవి తాత్కాలికంగానే ఉంటాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. వర్షాలు ప్రారంభమైతే ఎగుమతి పూర్తిగా తగ్గిపోయే అవకాశముంది. దసరా వరకు నష్టం వాటిల్లకుండా ధరలుంటాయని చెప్తున్నారు. తోటల్లో కాయల్లేకపోవడంతో ఇప్పుడు డిమాండ్ మెలమెల్లగా పెరిగి, ఢిల్లీ మార్కెట్ పుంజుకుంటూ ధరలను పెంచుతున్నారని తెలుస్తోంది.
ధరలు పెరగడం మంచిదే
ధరలు పెరగడం మంచి పరిణామమే. అయితే నెల ముందే ఇది జరిగి ఉంటే రైతులు బాగేపడేవారు. తోటల్లో కాయల్లేని తర్వాత పెరగడంతో తక్కువ మందికే ప్రయోజనం కలుగుతుంది.
– పెంచలనారాయణరెడ్డి, నిమ్మ రైతు, అంకుపల్లి


