● ఎంపీ గురుమూర్తి
గూడూరు రూరల్: కోటలోని అంబేడ్కర్ ఎస్సీ గురుకులాన్ని ఐఐటీ, జేఈఈ, నీట్ ఎక్సలెన్స్ సెంటర్ పేరుతో ఎత్తేసి 600 మంది దళిత విద్యార్థుల కడుపు కొట్టడం దారుణమని తిరుపతి ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడారు. కలెక్టర్‌కు తెలియకుండా ఎస్సీ గురుకులాన్ని విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆదేశాల మేరకు ఎత్తేయడం దుర్మార్గమని చెప్పారు. ఇక్కడ ఐదు నుంచి ఇంటర్ వరకు చదువుతున్న 600 మంది విద్యార్థులను ఖాళీ చేయించి వారిని వాకాడు, చిల్లకూరు, నాయుడుపేట ప్రాంతాల్లోని గురుకులాలకు తరలించి అదనపు భారాన్ని మోపడం సిగ్గుచేటని విమర్శించారు. ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించి భవనాలను నిర్మించడం చేతగాక, ఉన్న గురుకులాన్ని మూసేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. విద్యార్థుల ఆవేదన, గురుకుల పాఠశాల ఆవశ్యకతతో పాటు కొనసాగించేలా చర్యలు చేపట్టాలని కోరుతూ ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. విషయాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించి దళిత విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని తెలిపారు.
డీఎఫ్‌ఓగా శ్రీకాంత్‌రెడ్డి
నెల్లూరు(అర్బన్): జిల్లా అటవీశాఖాధికారి (డీఎఫ్‌ఓ)గా కావలి సబ్ డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీకాంత్‌రెడ్డి పూర్తి అదనపు బాఽధ్యతలను వేదాయపాళెంలోని ఆ శాఖ కార్యాలయంలో ఆదివారం స్వీకరించారు. ఇప్పటి వరకు డీఎఫ్‌ఓగా పనిచేసిన ఐఎఫ్‌ఎస్ మహబూబ్‌బాషా ఉత్తరాఖండ్‌లోని దెహ్రాదూన్‌లో గల ఇందిరాగాంధి నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో అక్టోబర్ తొమ్మిది వరకు నిర్వహించనున్న ప్రొఫెషనల్ స్కిల్ అప్‌గ్రడేషన్ శిక్షణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రిలీవయ్యారు. దీంతో శ్రీకాంత్‌రెడ్డిని ఏపీ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అండ్ హెడ్ ఫారెస్ట్స్ ఫోర్స్ డాక్టర్ చలపతిరావు నియమించారు.
గురుకులం ఎత్తివేత
దళిత బిడ్డలపై కుట్రే
కోట: కోటలో ఎస్సీ గురుకుల పాఠశాల, కళాశాలను ఎత్తేయడం దళిత బిడ్డలపై జరిగిన కుట్రగానే భావించాల్సి వస్తుందని రిటైర్డ్ సీఐడీ అడిషనల్ డీజీ, ఐపీఎస్ సునీల్‌కుమార్ పేర్కొన్నారు. ఎస్సీ గురుకులాన్ని దళిత సంఘాలతో కలిసి ఆదివారం పరిశీలించారు. ముందస్తు సమాచారంతో గేట్లను అధికారులు మూసేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళిత సంఘాల నేతలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 600 మంది విద్యార్థులు చదువుతున్న గురుకులాన్ని ఎలాంటి సమాచారం లేకుండా మూసేయడం దారుణమన్నారు. ఇతర చోట్ల పిల్లలు సర్దుబాటు కాకపోవడంతో వంద మంది వరకు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని తెలిపారు. నీట్, ఐఐటీ శిక్షణ కేంద్రం కోసం ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నా, వాటిని పరిశీలించకుండా ఖాళీ చేయించారని ఆరోపించారు. గురుకులాన్ని కొనసాగించాలని, అప్ప టి వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. నేతలు మీజూరు మాధవ్, దాసరి అశోక్, మల్లికార్జున్, వసంత్ తదితరులు పాల్గొన్నారు.


