డీఎస్సీ దగాపై ప్రశ్నిస్తే డైవర్షన్‌ పాలిటిక్స్‌ | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీ దగాపై ప్రశ్నిస్తే డైవర్షన్‌ పాలిటిక్స్‌

Aug 10 2026 12:16 AM | Updated on Aug 10 2026 12:16 AM

కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

పొదలకూరు: డీఎస్సీ దగాపై తాము ప్రశ్నిస్తే.. డైవర్షన్‌ పాలిటిక్స్‌కు కూటమి ప్రభుత్వ పెద్దలు పాల్పడుతున్నారని, దగాపడిన నిరద్యోగులకు సర్కార్‌ సమాధానం చెప్పాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బ్రాహ్మణపల్లిలో పార్టీ రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ రావుల దశరథరామయ్యగౌడ్‌, సర్వేపల్లి ఐటీ వింగ్‌ ప్రెసిడెంట్‌ రావుల ఇంద్రసేన్‌గౌడ్‌ ఆధ్వర్యంలో గ్రామదేవత అంకమ్మతల్లి ప్రత్యేక పూజలకు రాష్ట్ర మహిళా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాకాణి పూజిత, కాకాణి ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డీఎస్సీ దగాలో డైవర్షన్‌ పాలిటిక్స్‌పై ప్రజలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. డీఎస్సీపై తమ పార్టీ సాగిస్తున్న పోరాటాలను చూసి టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. వీరిలో అభద్రతాభావం పెరిగిందని, మీడియా సమావేశాల్లో మాట్లాడే తీరును పరిశీలిస్తే ఇదే విషయం అర్థమవుతోందని చెప్పారు. డీఎస్సీలో చోటుచేసుకున్న అవకతవకలపై స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అక్రమాల విషయమై తాము ఆధారాలతో సహా మాట్లాడుతున్నామని గుర్తుచేశారు. క్రీడాకారుల కోటాలో గతంలో ఇచ్చిన జీఓలను మార్చి కొత్త వాటిని తీసుకురావడం వెనుక అక్రమాలు దాగున్నాయనే అంశాన్ని తాము నమ్ముతున్నామని చెప్పారు.

పార్టీ పటిష్టతకు శ్రేణులే కారణం

జిల్లా అధ్యక్షుడిగా అన్ని నియోజకవర్గాల్లో తాను పర్యటిస్తున్నానని, సర్వేపల్లి నియోజకవర్గంలో పార్టీ పటిష్టంగా ఉందంటే అందుకు కార్యకర్తలు, నేతలే కారణమని చెప్పారు. బాధ్యతలను తన కుమార్తె పూజిత భుజాలపై వేసుకొని కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. పార్టీ శ్రేణుల నిబద్ధతకు ఏమిచ్చినా రుణాన్ని తీర్చుకోలేనన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించారని మండిపడ్డారు. టీడీపీ నిర్వహించే కార్యక్రమాలు వెలవెలబోతున్నాయని ఎద్దేవా చేశారు. భవిష్యత్తంతా తమ పార్టీదేనని, జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి సీఎం కావడం తథ్యమని చెప్పారు.

భారీ ర్యాలీలు నేడు

డీఎస్సీ దగాపై జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలను తమ పార్టీ శ్రేణులు, విద్యార్థులు, యువత సోమవారం నిర్వహించనున్నారని కాకాణి వెల్లడించారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలులో నిర్వహించనున్న ర్యాలీకి అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, వెన్నపూస దయాకర్‌రెడ్డి, కోనం చినబ్రహ్మయ్య, బొమ్మిరెడ్డి హరగోపాల్‌రెడ్డి, దాసరి భాస్కర్‌గౌడ్‌, వెన్నపూస కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement