ఆక్రమించేద్దాం.. అడిగేదెవరు? | - | Sakshi
Sakshi News home page

ఆక్రమించేద్దాం.. అడిగేదెవరు?

Aug 10 2026 12:16 AM | Updated on Aug 10 2026 12:16 AM

నెల్లూరు నగరంలో ప్రజలకు ట్రాఫిక్‌ నరకం చూపిస్తోంది. రహదారులు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన పరిస్థితి ఉంది. ప్రధాన వీధుల్లో వాహనాలను రోడ్లపైనే పార్కింగ్‌ చేస్తుండటంతో కష్టాలు తప్పడం లేదు. ఈ సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు.

నెల్లూరు(బారకాసు): నెల్లూరు నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. నగర పాలక సంస్థ పరిధిలో సుమారు 10 లక్షల మంది నివసిస్తుండగా.. వివిధ పనుల నిమిత్తం నిత్యం ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు నగరానికి రాకపోకలు సాగిస్తుంటారు. దీనికితోడు వాహనాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, షాపింగ్‌ మాల్స్‌, ఆస్పత్రులు, నిత్యావసర సరుకులు, పండ్లు, కూరగాయలు తదితర వ్యాపార సంస్థలు అధికంగా ఉన్నాయి. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో నగరంలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ రద్దీ తీవ్రంగా ఉంటోంది.

నిబంధనలు గాలికి..

షాపింగ్‌ మాల్స్‌, వాణిజ్య సముదాయాల నిర్మాణాల్లో పార్కింగ్‌ స్థలం తప్పనిసరిగా ఉండేలా నిబంధనలు ఉన్నప్పటికీ.. వాటి అమలు సక్రమంగా జరగడం లేదన్న ఆరోపణలున్నాయి. కొన్ని నిర్మాణాల్లో సెల్లార్‌ను పార్కింగ్‌కు కేటాయించకుండా కమర్షియల్‌ అవసరాలకు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌కు వచ్చే వాహనాలను రోడ్డుపైనే నిలిపివేస్తున్నారు. ఫలితంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

ఆక్రమణలతో..

మరోవైపు కొందరు వ్యాపారులు రోడ్డు మార్జిన్‌, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. కొంతకాలం తర్వాత అవే శాశ్వత నిర్మాణాలుగా మారుతున్నాయి. పండ్లు, టిఫిన్‌ తదితర దుకాణాలు రోడ్డు మార్జిన్‌లోకి విస్తరించడంతో పాదచారులు రోడ్డుపైనే నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో విశాలంగా ఉండాల్సిన ప్రధాన రహదారులు క్రమంగా కుచించుకుపోతున్నాయి.

పట్టించుకోని అధికారులు

ట్రాఫిక్‌ సమస్యను నియంత్రించేందుకు పోలీసులు, కార్పొరేషన్‌ అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాల్సి ఉన్నా.. ఆశించిన స్థాయిలో చర్యలు కనిపించడం లేదని నగరవాసులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలు, రోడ్డు, ఫుట్‌పాత్‌ ఆక్రమణలను అధికారులు అడ్డుకోవాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. కార్పొరేషన్‌ అధికారులు సమావేశాల్లో రోడ్డు విస్తరణ, ఆక్రమణల తొలగింపుపై హామీలు ఇస్తున్నా.. ఆచరణలో మాత్రం ఆశించిన స్థాయిలో చర్యలు చేపట్టడం లేదని పలువురు పేర్కొంటున్నారు.

విస్తరణతోనే పరిష్కారం

నగరంలో పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా రహదారులను విస్తరించడంతోపాటు ఫుట్‌పాత్‌లు, రోడ్డు మార్జిన్‌లను ఆక్రమణల నుంచి రక్షించాలని నగరవాసులు కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలు, పార్కింగ్‌ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి.. ఆక్రమణలను తొలగించి రోడ్డు విస్తరణ పనులు చేపడితే నగరంలో ట్రాఫిక్‌ ఇబ్బందులకు కొంతమేర పరిష్కారం లభించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా

షాపింగ్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణాలు

రోడ్డుపైనే వాహనాల పార్కింగ్‌

పాదచారులు, వాహనదారుల

రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు

చోద్యం చూస్తున్న టౌన్‌ప్లానింగ్‌

అధికారులు

రోడ్డు విస్తరణతోనే సమస్యకు పరిష్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement