టీడీపీ గూండాగిరీకి పోలీసుల గులాంగిరీ | Police mark rowdyism in Pulivendula ZPTC byelection | Sakshi
Sakshi News home page

టీడీపీ గూండాగిరీకి పోలీసుల గులాంగిరీ

Aug 13 2025 4:34 AM | Updated on Aug 13 2025 4:37 AM

Police mark rowdyism in Pulivendula ZPTC byelection

పోలీసుల పహారాలో ‘అధికారిక రిగ్గింగ్‌’   

పచ్చ ఖాకీల చేతుల్లో ప్రజాస్వామ్యం ఖూనీ

అంతటా ఖాకీ రాజ్యం... పచ్చ సైన్యం స్వైరవిహారం 

పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో పోలీసు మార్కు రౌడీయిజం 

చెక్‌పోస్టులతో పులివెందుల అష్టదిగ్బంధం 

ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు 

ఇతర ప్రాంతాల నుంచి టీడీపీ గూండాల తరలింపు 

వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తల ఇళ్లపై దాడులు, దౌర్జన్యాలు 

యథేచ్ఛగా దొంగ ఓట్లతో రిగ్గింగ్‌... డీఐజీ కోయ ప్రవీణే రింగ్‌మాస్టర్‌ 

ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి అక్రమ నిర్బంధం 

వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై పోలీసుల దండయాత్ర 

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కాళ్లావేళ్లా పడ్డ కార్యకర్తలు

రిగ్గింగ్‌ రింగ్‌ మాస్టర్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌ టీడీపీ మాజీ ఎంపీ అల్లుడే

జెడ్పీటీసీ ఉప ఎన్నిక సాక్షిగా పులివెందులలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. ఖాకీలే పచ్చరౌడీల్లా తెగబడ్డారు. పోలీసు పహారాలోనే అధికారిక రిగ్గింగ్‌ యథేచ్ఛగా సాగిపోయింది. టీడీపీ కూటమి కుతంత్రాన్ని పచ్చ ఖాకీలు అంతా తామై అమలు చేశారు. రాజ్యాంగాన్ని నిర్భీతిగా కాలరాశారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఎన్నడూలేని రీతిలో పోలీసులు సర్వం తామై ఎన్నికల అక్రమాలకు బరితెగించారు. 

ఓటు వేసే ప్రజల రాజ్యాంగ హక్కును అడ్డుకున్నారు. దాడులతో తెగబడి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. సామాన్యులు కనీసం పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. టీడీపీ గూండాలు దాడులకు తెగిస్తూ బీభత్సం సృష్టిస్తున్నా చోద్యం చూశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ రౌడీలు దొంగ ఓట్లు వేసేందుకు రాచబాట పరిచారు.  

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కడప: జెడ్పీటీసీ ఉప ఎన్నికలో చంద్రబాబు ప్రభుత్వ అరాచకానికి వత్తాసు పలకడమే విద్యుక్త ధర్మం అంటూ పోలీసులు కొత్త మాన్యువల్‌ను అమల్లోకి తెచ్చారు. పత్తేపారం చేస్తున్నారా అనే దిగజారుడు భాషతో పచ్చ ఖాకీల అధికారిక రౌడీయిజానికి డీఐజీ కోయ ప్రవీణ్‌ రింగ్‌ మాస్టర్‌గా వ్యవహరించారు. ఈయన ఓ టీడీపీ మాజీ ఎంపీ అల్లుడే కావడం గమనార్హం. 

లాఠీచార్జితో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను చెల్లాచెదురు చేయమని పచ్చ పైత్యం ప్రదర్శించారు. ఇక, కాల్చిపారేస్తా.. నా కొడకా అంటూ డీఎస్పీ మురళీనాయక్‌ పచ్చిరౌడీలా చెలరేగిపోయారు. ఎస్పీ అశోక్‌కుమార్‌ నుంచి డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు మొత్తం పోలీసు వ్యవస్థ ప్రజా­స్వామ్యాన్ని ఖూనీ చేసిన కుట్రలో భాగస్వామిగా మారింది. 

ఓటర్లను అడ్డుకునేందుకు పక్కా స్కెచ్‌ 
జెడ్పీటీసీ ఉప ఎన్నికలో అక్రమాలు, టీడీపీ రిగ్గింగ్‌కు అడ్డుఅదు­పు లేకుండా చేసేందుకు పోలీసులు పక్కా స్కెచ్‌ వేశారు. రెక్కీ నిర్వహించి హత్యలు చేసే కిరాయి మూకల్లా ఖాకీలు పులివెందులపై పడ్డారు. వెయ్యిమందికిపైగా పోలీసులు మండలాన్ని అష్ట దిగ్బంధం చేశారు. వారం రోజులుగా పులివెందులలో పో­లీ­సు మార్క్‌ రౌడీయిజంతో అందరినీ  భయభ్రాంతులకు గురి­చే­శారు. 

టీడీపీ ప్రభుత్వ కుతంత్రంతో ఓ గ్రామంలోని ఓటర్లకు వేరే గ్రామంలో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి వద్ద­కు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు వెళ్లకుండా పోలీసులు రంగంలోకి దిగారు. ఎక్కడపడితే అక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఇక మంగళవారం పోలింగ్‌ సందర్భంగా పోలీసులు పూర్తిగా బరితెగించేశారు. 

ఇళ్ల నుంచి బయటకు వచ్చిన ఓటర్లను లాఠీలు ఝళిపిస్తూ బూతు­లు తిడుతూ వెనక్కి పంపించేశారు. అయినా సరే తాము ఓట్లు వేస్తామని పట్టుబట్టినవారిపై విరుచుకుపడ్డారు. అనుమతించా­లని కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. ఓటర్ల చేతు­ల్లోని స్లిప్‌లను గుంజుకున్నారు. ‘‘మీ దగ్గర ఓటరు స్లిప్పులు లేవు కాబట్టి అనుమతించం’’ అని తర్వాత చెప్పడం గమనార్హం. ఓ విధంగా చెప్పాలంటే ఖాకీ గూండాగిరీ రాజ్యమేలింది.  

పోలీసు పహారాలోనే టీడీపీ రిగ్గింగ్‌ 
టీడీపీ రిగ్గింగ్‌కు పోలీసులు రక్షాకవచంగా నిలిచారు. పులివెందులలోని అన్ని పోలింగ్‌ బూత్‌లలోని వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. పోలీసుల సమక్షంలోనే వారిని బలవంతంగా బయటకు గెంటేశారు. అనంతరం ఏకపక్షంగా రిగ్గింగ్‌ చేసుకున్నారు. కాగా, జమ్మలమడుగు, కమలాపురం నుంచి టీడీపీ కూటమి గూండాలను కూడా రప్పించారు. వాస్తవానికి ఇతర ప్రాంతాల వారిని పో­లింగ్‌ రోజున అనుమతించకూడదు. 

పోలీసులు అవేమీ ప­ట్టించుకోకుండా కూటమి గూండాలకు రాచబాట పరిచారు. దీంతో పచ్చ గూండాలు వైఎస్సార్‌సీపీ నేత­లు, కార్యకర్తల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. భారీగా ఓటర్లు ఉన్న గ్రామాలను లక్ష్యంగా చేసుకుని మరీ విధ్వంసానికి పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు, సామాన్యులు ఓటు వేసేందుకు వెళ్లకుండా నిరోధించారు. స్లిప్పులను తీసుకుని చింపివేశారు. 

ఇక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ వర్గీయులు, గూండాలు పోలింగ్‌ కేంద్రాల్లోకి దూసుకెళ్లి యథేచ్ఛగా దొంగ ఓట్లు వేశారు. పోలీసులే వారిని దగ్గరుండి తీసుకువెళ్లి మరీ దొంగ ఓట్లు వేయించడం గమనార్హం. సాయంత్రం 5 గంటలకు ఓటింగ్‌ ముగిసేవరకు పోలీసుల పహారాలోనే టీడీపీ రిగ్గింగ్‌ యథేచ్ఛగా కొనసాగింది.   

వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై ఖాకీల దండయాత్ర 
డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ ఆశోక్‌కుమార్, ఏఎస్పీ ప్రకాష్  బాబు, డీఎస్పీ మురళీనాయక్, మరో ఆరుగురు సీఐలు, 10 మంది ఎస్‌ఐలు, వందలమంది పోలీసులతో వైఎస్సార్‌సీపీ కార్యాలయంలోకి చొచ్చుకువచ్చారు. వారికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నినాదాలు చేయగా లాఠీచార్జితో చెదరగొట్టాలని డీఐజీ ఆదేశించారు. దాంతో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. 

తమను ఓట్లు వే సేందుకు అనుమతించాలని ఓటర్లు కాళ్లా వేళ్లా పడినా పోలీసులు ఏమాత్రం కనికరించలేదు. ఇదే అదనుగా వైఎస్సార్‌సీపీ కార్యాలయం గేటుకు తాళం వేసి సాయంత్రం 5 గంటల వరకు ఎంపీ అవినాశ్‌రెడ్డిని నిర్బంధంలోనే ఉంచారు. డీఐజీ కోయ ప్రవీణ్‌ ఆయన పక్కనే కూర్చుని మరీ ఈ కుతంత్రాన్ని పకడ్బందీగా పర్యవేక్షించారు. 

రిగ్గింగ్‌ ఆధారాలు ఉంటే ఇవ్వండి: డీఐజీ 
ఎంపీ వైఎస్‌ అవినాష్  రెడ్డిని ముందస్తు అరెస్టు చేసి సాయంత్రం వరకు గృహ నిర్బంధంలో ఉంచామని డీఐజీ కోయ ప్రవీణ్‌ మీడియాకు తెలిపారు. తాము బందోబస్తు కోసమే వచ్చామని చెప్పుకొచ్చారు. రిగ్గింగ్‌ జరిగినట్లు ఆధారాలుంటే ఇవ్వాలని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. రిగ్గింగ్‌కు సంబంధించిన ఆధారాలు ఉంటే ఎన్నికల సంఘం, కోర్టుకు ఇస్తారు కానీ డీఐజీకి ఎందుకు ఇస్తారని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.

కాల్చిపడేస్తా నా కొడకా.. అంటూ డీఎస్పీ రౌడీయిజం
పులివెందుల డీఎస్పీ మురళీనాయక్‌ అయితే వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వీరంగం సృష్టించారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తమను ఓటు వేయనీయడం లేదని, రిగ్గింగ్‌ను ఆపాలంటూ ఓటర్లు పోలీసులకు విజ్ఞప్తి చేసే యత్నం చేశారు. అక్కడే ఉన్న డీఎస్పీ ఓటర్లపై చిందులు తొక్కారు. ‘కాల్చిపడేస్తా నా కొడకా.. ఏమనుకుంటున్నావ్, యూనిఫాం ఇక్కడ..’ అంటూ రౌడీ తరహాలో చెలరేగిపోయారు. పోలీసులు కుట్రపూర్వకంగానే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేందుకు యత్నించారు. 

లాఠీచార్జి చేసి చెదరగొట్టాలని డీఐజీ ఆదేశించడం.. పరుష వ్యాఖ్య­లతో డీఎస్పీ మురళీనాయక్‌ చెలరేగిపోవడం.. ఇద్దరు, ముగ్గురు సీఐలు విరుచుకుపడడం అంతా పక్కా పన్నాగంతోనే సాగింది. కార్యకర్తలు ప్రతిఘటించి పరిస్థితి అదుపుతప్పితే.. అదే సాకుగా ‘తీవ్రమైన చర్యల’కు తెగించాలన్నది పోలీసుల కుతంత్రం. కాల్పులకూ తెగించేందుకు వారు సంసిద్ధంగా ఉన్నారని స్పష్టమైంది. పోలీసులు ఉద్దేశం గుర్తించిన ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి కార్యకర్తలను వారించారు. ‘ఎలాంటి ఉద్రిక్తతలు వద్దు. కార్యకర్తలు సంయమనం పాటించాలి’ అని హితవు పలికారు.   

రిగ్గింగ్‌ రింగ్‌ మాస్టర్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌  మొన్న విపరీత వ్యాఖ్యలు.. 
నేడు అధికార దుర్వినియోగం 
పులివెందుల మండలంలో టీడీపీ అధికారిక రిగ్గింగ్‌కు రింగ్‌ మాస్టర్‌గా డీఐజీ కోయ ప్రవీణ్‌ వ్యవహరించారు. ఐపీఎస్‌ అధికారిగా తన చట్టబద్ధమైన అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ దిగజారుడుతనం ప్రదర్శించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు సృష్టించి కుతంత్రానికి బరితెగించారు. ఎస్పీ అశోక్‌ కుమార్‌తో పాటు యావత్‌ పోలీసు యంత్రాంగాన్ని తన కుట్రలో భాగస్వామిగా చేసుకుని చెలరేగిపోయారు. 

పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేశ్‌యాదవ్, పార్టీ కీలక నేత వేల్పుల రాములపై హత్యాయత్నాన్ని డీఐజీ ప్రవీణ్‌ తక్కువ చేసి చూపించేందుకు యత్నించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నేతలను ఉద్దేశించి ‘ఒక ఊరివారు మరో ఊరికి ఎందుకు వెళ్లారు? పత్తేపారం చేయడానికా’ అంటూ వెటకారం ఆడారు. తద్వారా ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు వత్తాసు పలకడమే తన ఉద్దేశం అని చాటారు. 

పోలింగ్‌ సందర్భంగా  ప్రవీణ్‌ అధికార దుర్వినియోగం పతాక స్థాయికి చేరింది.  ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి అక్రమ గృహ నిర్బంధం, వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై దాడి తరహాలో పోలీసులు చొచ్చుకుపోవడాన్ని  ప్రవీణ్‌ స్వయంగా పర్యవేక్షించారు.  వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై లాఠీచార్జికి స్వయంగా ఆదేశించడం గమనార్హం.  ప్రవీణ్‌ ఆదేశాలతోనే ఎస్పీ అశోక్‌కుమార్, డీఎస్పీ మురళీనాయక్‌తో పాటు పోలీసులు అక్రమాలకు తెగబడ్డారు.  

తెల్లవారుజామునే పోలీసుమార్కు గూండాయిజం 
ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి అక్రమ నిర్బంధం 
పులివెందులలో మంగళవారం సూర్యోదయానికి ముందే పచ్చ ఖాకీలు గూండాగిరీకి తెరతీశారు. భారీగా పోలీసు అధికారులు, సిబ్బంది వేకువజామునే ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి నివాసంపై దండెత్తారు. దురాక్రమణదారుల మాదిరిగా ఇంట్లోకి దూసుకెళ్లారు. ఎంపీని అక్రమంగా అరెస్టు చేశారు. ఎంపీగా తన నియోజకవర్గ పరిధిలోని జెడ్పీటీసీ ఉప ఎన్నికలను పర్యవేక్షించడం ఆయన హక్కు, బాధ్యత. కానీ, దీన్ని పోలీసులు కాలరాశారు. ఆయనను అక్రమంగా అరెస్టు చేస్తున్నట్టు తెలిపారు. 

పోలీసుల దౌర్జన్యంపై వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర నిరసన తెలపగా వారిని ఈడ్చి పడేశారు. ఎంపీని తమ వాహనంలో బలవంతంగా ఎక్కించుకుని ముద్దనూరు వైపు తీసుకువెళ్లారు. నిడిజివ్వి గ్రామంలో మాజీ ఎమ్మె­ల్యే సు«దీర్‌రెడ్డి ఇంటి వద్ద దింపి ఇక్కడే ఉండాలని ఆదేశించారు. అక్కడికి వై­ఎస్సార్‌సీపీ కార్యకర్త­లు భారీగా తరలివచ్చారు. 

పోలీసుల అరాచకాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ  నేతలు, కార్యకర్తలు యర్రగుంట్ల వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలిలో బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఎంపీ పులివెందులలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి చేరుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement