చిరుద్యోగులపై చంద్రబాబు సర్కార్‌ ప్రతాపం | Medical Department issues show cause notices to employees on strike | Sakshi
Sakshi News home page

చిరుద్యోగులపై చంద్రబాబు సర్కార్‌ ప్రతాపం

Oct 8 2026 4:19 AM | Updated on Oct 8 2026 4:19 AM

Medical Department issues show cause notices to employees on strike

డిమాండ్లు పరిష్కరించాలని నిరసన చేస్తుంటే ఉద్యోగాలు తొలగిస్తామని బెదిరింపులు  

ఉద్యోగ సంఘాల నాయకుల ఇళ్లకు వెళ్లి ఇంటెలిజెన్స్‌ పోలీసుల ఆరా  

మీవాళ్ల ఉద్యోగాలు పోతాయంటూ కుటుంబసభ్యులకు హెచ్చరికలు 

ఇప్పటికే సమ్మెలో ఉన్న ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తున్న వైద్యశాఖ

సాక్షి, అమరావతి: హక్కుల సాధన కోసం శాంతియుతంగా నిరసనలు చేస్తున్న చిరుద్యోగులపై చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రతాపం చూపుతోంది. ఏకంగా ఉద్యోగాలు ఊడగొట్టి రోడ్డున పడేస్తామని బెదిరిస్తోంది. సర్వీస్‌ రెగ్యులరైజేషన్, ఆ ప్రక్రియ అయ్యే వరకు 100 శాతం గ్రాస్‌ శాలరీ అమలు సహా ఇతర డిమాండ్లు పరిష్కరించాలని వైద్యశాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఆందోళనలకు దిగారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం యూనియన్‌ నాయకుల ఇళ్లకు పోలీసులను పంపి బెదిరింపులకు దిగుతోంది. ఇంటెలిజెన్స్‌ పోలీసులు నాయకుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ వివరాలను సేకరిస్తున్నారు. అంతేకాకుండా ఆందోళనలు విరమించకపోతే ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగిస్తుందని కుటుంబసభ్యులను హెచ్చరిస్తున్నట్టు వెల్లడైంది.  

30 మందికిపైగా నోటీసులు 
సమస్యలు పరిష్కరించాలని రెండు నెలలుగా వివిధ రూపాల్లో కాంట్రాక్ట్‌ ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో మంగళవారం నుంచి సమ్మెలోకి వెళ్లారు. స్టాఫ్‌నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్‌లు.. ఇలా వివిధ విభాగాల్లోని 14 వేలమందికి పైగా ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. మంగళవారం నుంచి సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులకు వైద్యశాఖ షోకాజ్‌ నోటీసులు ఇస్తోంది.అనధికారికంగా విధులకు దూరంగా ఉంటున్నందుకు చర్య­లు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు సమ్మెకు నేతృత్వం వహిస్తున్న వివిధ సంఘాలకు చెందిన 30 మందికిపైగా ప్రతినిధులను ప్రభుత్వం గుర్తించినట్టు సమాచారం. వీరందరికీ ఇప్పటికే షోకాజ్‌ నోటీసులు జారీచేసిన వైద్యశాఖ.. గురు, శుక్రవారాల్లో ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.  

వెనక్కి తగ్గం
సమ్మెలో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో కాంట్రాక్ట్‌ ఉద్యోగులు అత్యవసర సేవలను బహిష్కరించారు. జీజీహెచ్‌లు, ఇతర ప్రదేశాల్లో పెద్ద ఎత్తున చేరి నిరసనలు తెలి­పా­రు. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా వెన­క్కు తగ్గబోమని తేల్చి చెప్పారు. ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో వైద్యసేవలపై తీవ్ర ప్రభావం పడింది.

తక్షణమే రెగ్యులర్‌ చేయమని కోరడం లేదు 
కోవిడ్‌ వ్యాప్తి సమయంలో మేమంతా ప్రాణాలకు తెగించి పోరాడాం. కొన్నేళ్లుగా పనిచేస్తున్న మా సేవలను గుర్తించి రెగ్యులర్‌ చేయాలని మేం కోరుతున్నాం. వెంటనే రెగ్యులర్‌ చేయాలని కూడా మేం డిమాండ్‌ చేయడం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో ఎప్పటిలోగా రెగ్యులర్‌ చేస్తారో రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని కోరుతున్నాం. ఆ ప్రక్రియ అయ్యే వరకు 100 శాతం గ్రాస్‌ శాలరీ ఇవ్వాలని అడుగుతున్నాం. న్యాయమైన డిమాండ్లతో సమ్మె చేస్తుంటే పోలీ­సులు మా నాయకుల ఇళ్ల దగ్గరకు వెళ్తున్నారు. ఉద్యోగాలు పోతాయని కుటుంబసభ్యులను బెదిరిస్తున్నారు. నిరసన తెలప­డం భారత రాజ్యాంగం మాకిచ్చిన హక్కు. ఎన్ని బెదిరింపులకు దిగినా మేం బెదరం.    – అజయ్‌కుమార్, కన్వీనర్, వైద్యశాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగసంఘాల జేఏసీ  

అన్ని సౌకర్యాలు కల్పించాలి  
వైద్యశాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమ్మెకు మ­ద్దతు తెలుపుతున్నామని సీఐటీయూ  ప్రధా­­న కార్యదర్శి ఎ.వి.నాగేశ్వరరావు బుధవారం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సంఘ ప్రతినిధులతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. శాశ్వత ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ వేతనాల చెల్లింపుల్లో వీరు అన్యాయానికి గురవుతున్నారని చెప్పారు. చట్ట ప్రకా­రం వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement