బంగాళాఖాతంలో అల్పపీడనం | Low pressure area formed in Bay of Bengal: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

బంగాళాఖాతంలో అల్పపీడనం

Apr 8 2025 6:07 AM | Updated on Apr 8 2025 6:07 AM

Low pressure area formed in Bay of Bengal: Andhra Pradesh

తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం

10, 11 తేదీల్లో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు 

సాక్షి, అమరావతి/బుట్టాయగూడెం: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మంగళవారం నైరుతి బంగాళాఖాతం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత 48 గంటల్లో ఉత్తర దిశగా మయన్మార్‌ తీరం వైపు ప్రయాణిస్తుందని పేర్కొంది. ఇది తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.

దీని ప్రభావంతో 10, 11 తేదీల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళ, బుధవారాల్లో కూడా కొన్నిచోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. సోమవారం ఏలూరు జిల్లా బూట్టాయగూడెం మండలంలోని పలు గ్రామాల్లో వడగళ్ల వాన కురిసింది. మరోవైపు పలుచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

సోమవారం నంద్యాలలో అత్యధికంగా 41.5 డిగ్రీలు, కర్నూలు జిల్లా నడిచాగిలో 41.1, వైఎస్సార్‌ జిల్లా బలపనూరులో 41, ప్రకాశం జిల్లా నందనమారెళ్లలో 40.8, తిరుపతి జిల్లా గూడూరు, విజయనగరం జిల్లా నెలివాడలో 40.6, చిత్తూరు జిల్లా నగరిలో 40.5, అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లె 40.4, పల్నాడు జిల్లా రావిపాడులో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Advertisement
 
Advertisement
Advertisement