కుక్కే క్లూ అనుకున్నారు.. కానీ! | Kakinada Child Sunkara Gnaneswari Missing Case Latest News Updates | Sakshi
Sakshi News home page

కుక్కే క్లూ అనుకున్నారు.. కానీ!

Jun 13 2026 8:31 AM | Updated on Jun 13 2026 11:29 AM

Kakinada Child Sunkara Gnaneswari Missing Case Latest News Updates

రెండేళ్ల చిన్నారి. పెంపుడు కుక్కతో ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కానీ వారమైనా తిరిగి రాలేదు. తల్లిదండ్రుల కన్నీళ్లు, బంధవులు.. గ్రామస్తుల ఆందోళన, పోలీసుల విస్తృత గాలింపు.. ఏదీ ఇప్పటివరకు జ్ఞానేశ్వరి ఆచూకీని కనిపెట్టలేకపోయాయి. పెంపుడు కుక్క తిరిగి వచ్చినా.. దానికి హైటైక్‌ టెక్నాలజీ తగిలించి ఆచూకీ కనిపెట్టాలని ప్రయత్నించినా.. పాప జాడ మాత్రం దొరక్కపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని చిక్కుళ్ల అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ వారమైనా చిక్కలేదు. తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు..చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అలాగే 10 పోలీసు టీంలు, 40 మంది ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం.. మరికొందరు అధికారులు పాప కోసం చేపట్టిన సెర్చ్‌ ఆపరేషన్‌లో భాగమయ్యారు. అడవులు, కొండలు, గ్రామాలన్నీ నిర్విర్వామంగా జల్లెడ పడుతున్నారు. దీంతో ఈ కేసు దేశం దృష్టిని ఆకర్షించింది.

ఈ నెల 6న ఇంటి బయట ఆడుకుంటూ అదృశ్యమైంది. పెంపుడు కుక్కతో కలిసి బయటకు వెళ్లిన పాప తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే.. ఈ కేసులో పెంపుడు కుక్క కీలక ఆధారంగా మారొచ్చని పోలీసులు భావించారు. అదృశ్యమైన మూడు రోజుల తర్వాత కుక్క గ్రామానికి తిరిగి వచ్చింది. అయితే ఇంటి వద్ద ఉన్న హడావుడి చూసి మళ్లీ పారిపోయింది. ఈ క్రమంలో అది పలువురిపై దాడి చేసింది. అనంతరం డాగ్‌ క్యాచర్‌ సాయంతో అతికష్టం మీద దానిని పట్టుకుని ఇంటికి తీసుకువచ్చారు. ఓ తాడుతో కట్టేసి.. దానికి పోలీసును కాపలా ఉంచారు. నీరసంగా ఉన్న దానికి.. వెటర్నరీ సిబ్బంది వైద్య సేవలు అందించి కోలుకున్న తర్వాత పోలీసులు ప్రత్యేక చర్యలకు దిగారు.

పెద్దాపురం డీఎస్పీ తిలక్‌ పర్యవేక్షణలో పోలీస్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, అటవీ శాఖ, ఏఎన్‌ఎస్‌, క్యూఆర్టీ బృందాలు విస్తృత గాలింపు కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన జీపీఎస్‌ ట్రాకర్‌ను కుక్కకు అమర్చి వదిలారు. ట్రాకర్‌ ద్వారా కుక్క సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర సంచరించినట్లు గుర్తించారు. ఆ ప్రాంతాలన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కానీ, ఎక్కడా ఏ క్లూ లభించలేదు!.

ఇక చిన్నారి కాళ్లకు ఉన్న వెండి పట్టీలను గుర్తించేందుకు సిల్వర్‌ మెటల్‌ డిటెక్టర్లను వినియోగిస్తున్నారు. జ్ఞానేశ్వరి చివరిసారిగా కనిపించిన ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అయితే చిన్నారి ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు ఆపబోమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

అదే సమయంలో కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మొబైల్‌ టవర్‌ డంప్‌ డేటా, కాల్‌ డిటైల్‌ రికార్డులు, సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులకు సన్నిహితులైన వ్యక్తులతో పాటు చుట్టుపక్కలకు కొత్తగా వచ్చిన వ్యక్తులు, గంజాయి అలవాటు ఉన్న వారిపై కూడా నిఘా పెట్టారు. పగలు, రాత్రి తేడా లేకుండా గాలింపు కొనసాగుతోంది.

ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చిన్నారి క్షేమంగా తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరాలని ప్రజలు ప్రార్థిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కూడా స్పందిస్తూ, జ్ఞానేశ్వరి ఆయురారోగ్యాలతో ఇంటికి చేరాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement