సాక్షి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఉరుములు, పిడుగులతో వాతావరణం దద్దరిల్లింది. విజయవాడతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేని వర్షం కారణంగా రోడ్లపై భారీగా వర్షం నీరు నిలిచిపోయింది. పలుచోట్ల రోడ్లు చెరువులను తలపించాయి. విజయవాడ నగరంతో పాటు రూరల్ పరిధిలో పలు ప్రాంతాలు, రహదారులు జలమయం అయ్యాయి. దీంతో, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అలాగే, ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే, కృష్ణాజిల్లాలోని పెడన నియోజకవర్గంలో ఈదురుగాలులతో వర్షం కురిసింది. అనంతరం, విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

ఇదిలా ఉండగా.. ఏపీలోని ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్రానికి దగ్గర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే తూర్పు గోదావరి, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
HEAVY THUNDERSTORMS AND RAINS AHEAD FOR CENTRAL AP DURING TONIGHT ⚠️⚠️
The Monday storms missed #Vijayawada and now this storm looks even more perfect to enter into the city and bang with heavy rains. During next 2-3 hours, rains and thunderstorms will increase along entire… pic.twitter.com/BTOamAUb67— Andhra Pradesh Weatherman (@praneethweather) June 10, 2026
మరోవైపు..ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావం, అలాగే వాతావరణంలో ఏర్పడిన పలు మార్పుల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురవనున్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణలో చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ జిల్లాల్లో వర్షాలు..
ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, వికార్‌ఆబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


