లాకప్‌డెత్‌ సాక్షిగా హైడ్రామా..! | High drama as a witness to a lockup death | Sakshi
Sakshi News home page

లాకప్‌డెత్‌ సాక్షిగా హైడ్రామా..!

Jun 22 2026 5:57 AM | Updated on Jun 22 2026 5:58 AM

High drama as a witness to a lockup death

ఓవైపు బాధితులను పిలిపించుకొని సీఎం పరామర్శ 

మరోవైపు పోలీసు బాస్‌ను రక్షించేందుకు పథక రచన 

వ్యవహారాన్ని సెటిల్‌ చేయడానికే తెరపైకి ‘సిట్‌’  

సాక్షి ప్రతినిధి, విజయవాడ: సంచలనం సృష్టిస్తున్న సాయికృష్ణ మిస్సింగ్‌ కేసులో సరికొత్త డ్రామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం చంద్ర­బాబు ఒకవైపు బాధితులను పరామర్శించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వగా మరోవైపు పోలీసు బాస్‌ను కాపాడేందుకు పథక రచన చేసినట్లు తెలుస్తోంది. సాక్ష్యాలు, ఆధారాలు ధ్వంసమయ్యాక 40 రోజుల తరువాత తాపీగా సిట్‌ ఏర్పాటు పేరుతో చేతులు దులుపుకొంటోంది. ఈ ఘటనను సీఐ నాగరాజుకు ఆపాదించి తూతూమంత్రంగా దర్యాప్తు ముగించే యత్నం చేస్తున్నారు. ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ప్రతిష్ట మంటగలిసి పోవడంతో దీన్ని కప్పిపుచ్చేందుకు సర్కారు పడరాని పాట్లు పడుతోంది. సాయికృష్ణ ఉదంతంపై కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై అన్ని వర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ‘ఎవరో కులం వాడు క్రిమినల్‌ పనులు చేస్తే నేను బాధ్యత వహించాలా? ఎంపీలు, ఎమ్మెల్యేలు నోరు విప్పరా..?’ అంటూ సాయికృష్ణ మిస్సింగ్‌పై డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యానించా­రు. ఎన్నికల సమయ­ంలో సాయికృష్ణ కుటుంబం జనసేన తరపున పని చేయలేదా? అని పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  

టెక్నాలజీ ఏమైంది? 
తొలుత తాము సాయికృష్ణను తీసుకురాలేదని బుకా­యించినా తరువాత విధిలేని పరిస్థితుల్లో  టాస్‌్కఫోర్స్, కృష్ణలంక పోలీసులు కలిసి వెళ్లి మార్కాపురం నుంచి మే 9న సాయికృష్ణను విజయవాడకు తెచ్చామని ఒప్పుకోక తప్పలేదు. ఈ విషయాన్ని ఇప్పటికే విచారణాధికారి ఎదుట వెల్లడించినట్లు సమాచారం. ప్రభుత్వ పెద్దలకు, పోలీసు బాస్‌కు ముందుగానే దీనిపై సమాచారం ఉందని పోలీస్‌ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తెచ్చామని, శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని, 70 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. ప్రత్యేకించి విజ­యవాడ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం వాడటంలో దిట్టలు అని, నగరంలో అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఎన్నో కేసులు చేధించామని ప్రకటించే ఉన్నతాధికారులు సాయికృష్ణ ఆచూకీపై నోరు మెదపకపోవడం సందేహాలకు దారి తీస్తోంది. దీన్నిబట్టి ఈ వ్యవహారం అంతా ప్రభుత్వ పెద్దలు, పోలీసు బాస్‌ కనుసన్నల్లోనే జరిగినట్లు స్పష్టమవుతోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. కరుడు గట్టిన నేరస్తుల నుంచి సమాచారాన్ని రాబట్టే పోలీసులు సాయికృష్ణ అదృశ్యంపై వివరాలను సేకరించడం పెద్ద కష్టమేమి కాదని వ్యాఖ్యానిస్తున్నారు. కానిస్టేబుళ్లను విచారిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నా ఆ దిశగా దృష్టి సారించకపోవటాన్ని ప్రశ్నిస్తున్నారు. 

ల్యాండ్‌ డీల్‌ వ్యవహారమేనా..! 
సాయికృష్ణను మార్కాపురం నుంచి తెచ్చి రోజుల తరబడి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించాల్సిన అవసరం ఏముందనే కీలక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక భూ వివాదం దీనికి కారణమని.. ఎంపీ, పోలీసుబాస్‌ పెద్ద మొత్తంలో డీల్‌ కుదుర్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

క్రాంతి కుమార్‌ ఆత్మహత్య... 
సీఐ నాగరాజు వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నట్లు దళిత యువకుడు క్రాంతి కుమార్‌ సెల్ఫీ వీడియోలో వెల్లడించినా ఇంతవరకు దీనిపై పోలీసులు విచారణ చేపట్టలేదు. క్రాంతి కుమార్‌ ఆత్మహత్యకు కారకుడైన సీఐ నాగరాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఎందుకు కేసు నమోదు చేయలేదని దళిత సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. 

సీఐ ఇంటి వద్ద హైడ్రామా.. 
తనపై కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు సీఐ నాగరాజు ఇంటి వద్ద హైడ్రామా నడుపుతున్నారు. సీఐపై చర్యలు తీసుకోవద్దంటూ కొందరు యువకులు, మహిళలను పోగు చేసి ఆదివారం ఆందోళన చేయించారు. కొందరు పోలీసులు నాగరాజు ఇంటికి చేరుకుని విచారణ పేరుతో మంతనాలు సాగించారు. ఇక సాయంత్రం ధర్నా చౌక్‌ ప్రాంతం వద్ద సీఐకు అనుకూలంగా ధర్నా చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరిగినా పోలీస్‌ బాసులు వారించడంతో చివరి నిమిషంలో వెనక్కి తగ్గడం గమనార్హం. ఇవన్నీ కేసును పక్క దారి పట్టించేందుకు చేస్తున్న కుట్రలేనని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement