విశాఖ రైల్వే జోన్ విషయంలో చంద్రబాబు ద్రోహం
మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్
సాక్షి, విశాఖపట్నం: ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను జైలుకెళ్లడానికైనా సిద్ధమని వైఎస్సార్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు. శనివారం మద్దిలపాలెంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. విశాఖ రైల్వే జోన్ సాధన కోసం తాను చేసిన ప్రజా పోరాటంలో 6 నెలల జైలు శిక్ష పడటం ఉత్తరాంధ్ర ప్రజల పట్ల తనకున్న నిబద్ధతకు నిదర్శనమని.. దీనిని తాను గర్వకారణంగా భావిస్తున్నానని చెప్పారు. తాను చేసిన ఆమరణ నిరాహార దీక్షపై కోర్టు తీర్పును గౌరవిస్తూనే.. ప్రజాక్షేత్రంలో పోరాటం కొనసాగిస్తానని వెల్లడించారు.
ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేస్తానని.. కానీ విశాఖ హక్కుల కోసం పోరాటం మాత్రం ఆపేది లేదన్నారు. వాల్తేరు డివిజన్‌లో అత్యధిక ఆదాయాన్నిచ్చే కేకే లైన్‌ను ఒడిశాలోని రాయగడ డివిజన్‌లో కలుపుతుంటే.. కేంద్రంలో భాగస్వాములుగా ఉన్న కూటమి మంత్రులు, ఎంపీలు నోరు మెదపకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. చంద్రబాబుకు అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఉన్న శ్రద్ధ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ మీద, భోగాపురం ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ రోడ్డు మీద ఎందుకు లేదని నిలదీశారు.
ఓర్వలేకే డైవర్షన్ పాలిటిక్స్
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించిన మావిగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అమర్‌నాథ్ మండిపడ్డారు. చంద్రబాబుకు అమరావతిపై ప్రేమ.. మిగిలిన ప్రాంతాలపై కక్ష ఉన్నాయన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించిన మావిగన్‌ను ప్రజలు స్వాగతిస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. అందుకే లేనిపోని విమర్శలు చేస్తున్నారు. షర్మిల తీరు చూస్తుంటే కాంగ్రెస్ భావజాలం కంటే.. బాబు సారూప్యత భావజాలంతోనే పనిచేస్తున్నట్టు కనిపిస్తోందని చెప్పారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే ఆమె మాట్లాడుతున్నారన్నారు. ఆయన వెంట ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, సమన్వయకర్త మొల్లి అప్పారావు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకటరామయ్య ఉన్నారు.


