వైఎస్సార్‌సీపీ శ్రేణులపై లాఠీచార్జ్ చేస్తున్న సీఐ సత్యనారాయణ, పోలీసులు
ఆమదాలవలసలో పోలీసుల అత్యుత్సాహం
అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను ఖండిస్తూ వైఎస్సార్‌సీపీ
శాంతియుత నిరసన అడ్డుకుని లాఠీచార్జ్ చేసిన పోలీసులు
ఆమదాలవలస: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో శనివారం శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో పలువురు నాయకులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ నిరసనకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమదాలవలసలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్దకు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
అక్కడి నుంచి పట్టణంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేసేందుకు బయలుదేరగా, ఆమదాలవలస సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో 50 మందికి పైగా పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి కదలడానికి వీల్లేదని హెచ్చరించారు. తాము శాంతియుతంగా నిరసన తెలియజేస్తామంటూ ముందుకు కదలిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు రెచ్చిపోయి లాఠీచార్జ్ చేశారు.
ఇష్టారీతిన లాఠీలతో బాదారు. దీంతో పొందూరు మండలానికి చెందిన వైఎస్సార్‌సీపీ చేనేత విభాగం శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, ఆమదాలవలస మున్సిపాలిటీ బొడ్డేపల్లిపేటకు చెందిన సింగూరు రమేష్, బొడ్డేపల్లి రమణమూర్తి తదితరులు గాయపడ్డారు. వీరితోపాటు మరికొందరికి కూడా గాయాలయ్యాయి. చింతాడ రవికుమార్, మరికొందరు నాయకులను లాక్కెళ్లి వాహనాల్లో ఎక్కించి సరుబుజ్జిలి స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలియజేసేందుకు ప్రయత్నించినా పోలీసులు అడ్డుకుని దాడి చేయడం దుర్మార్గమని చింతాడ రవికుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు.


