సీసీఐ కొత్త నిబంధనలను వ్యతిరేకిస్తున్న జిన్నింగ్ మిల్లర్లు
కపాస్ కిసాన్ యాప్‌ను తప్పనిసరి చేసిన సీసీఐ
మిల్లుల విభజనను ఉపసంహరించుకోవాలని డిమాండ్
లేదంటే మిల్లులను నిరవధికంగా మూసివేస్తామని హెచ్చరిక
మిల్లర్లను సముదాయిస్తున్న మంత్రి తుమ్మల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. దేశవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అమల్లోకి తెచి్చన కొత్త నిబంధనలు జిన్నింగ్ మిల్లుల యజమానులకు రుచించడం లేదు. రైతుల నుంచి తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేసి, మద్దతు ధరకు సీసీఐ నోటిఫై చేసిన జిన్నింగ్ మిల్లుల్లో విక్రయించే పద్ధతి గత సంవత్సరం వరకు సాగింది. రాష్ట్రంలో గత సంవత్సరం వానాకాలం సీజన్‌లో 25 లక్షల మంది రైతులు సుమారు 43 లక్షల ఎకరాల్లో పత్తిని సాగుచేస్తే, సీసీఐ మద్దతు ధరకు కొనుగోలు చేసిన పత్తి 21 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, దాన్ని విక్రయించిన రైతులు 9 లక్షల మంది మాత్రమే.
రైతుల ఆధార్ కార్డులు, పట్టాదార్ పాస్ పుస్తకాల జిరాక్స్‌లను ముందుగానే తీసుకొని తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేసే దళారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు.. అదే పత్తిని నోటిఫైడ్ జిన్నింగ్ మిల్లులకు మద్దతు ధరకు విక్రయించే ప్రక్రియ కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ విభాగం దీనిని గుర్తించి, ఈ దందాలో భాగమైన సీసీఐ, రాష్ట్ర మార్కెటింగ్ శాఖ సిబ్బందిని సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో రైతు స్వయంగా మిల్లుకు వెళ్లి మద్దతు ధరకు పత్తిని విక్రయించేలా సీసీఐ నిబంధనలు విధించింది. ప్రతి రైతు ‘కపాస్ కిసాన్’అనే యాప్‌లో తన వివరాలను నమోదుచేసుకొని, దాని ద్వారానే లావాదేవీలు సాగించాలని ఆదేశించింది. ఈ యాప్‌ను రైతులు వినియోగించలేరని దళారులు, మిల్లర్లు భావించినప్పటికీ, ఇప్పటికే 23 వేల మంది రైతులు యాప్ ద్వారా రిజి్రస్టేషన్ చేసుకున్నారు.
ఎకరాకు 7 క్వింటాళ్ల ఆంక్షలు అందుకే...
దళారులు మార్కెట్‌లో తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేసి, రైతుల పాస్‌పుస్తకాలు, ఆధార్ కార్డుల ద్వారా ఎకరానికి 12 క్వింటాళ్ల చొప్పున పత్తిని సీసీఐ నోటిఫైడ్ సెంటర్లలో విక్రయించేవారు. ఒక రైతుకు ఐదెకరాల భూమి ఉంటే అందులో రెండెకరాల్లో పత్తి సాగు చేసినా, ఐదెకరాల్లో పత్తి సాగైనట్లు చూపి మాయ చేసేవారు. దీన్ని నివారించేందుకు సీసీఐ ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేయాలని ఆంక్షలు విధించింది. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ ఇచి్చన అంచనాల మేరకు రాష్ట్రంలో కూడా సగటున ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే దిగుబడి వస్తుందని తేల్చారు. ఈ మేరకు ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వానికి సీసీఐ తెలిపింది. ఈ నిర్ణయం మిల్లర్లకు అశనిపాతంగా మారింది.
ఉమ్మడి జిల్లా పరిధిలోని మిల్లుల్లోనే విక్రయాలు
రాష్ట్రంలో గతంలో పత్తి కొనుగోళ్లలో అనేక వింతలు చోటుచే సుకున్నట్టు విజిలెన్స్ విచారణలో తేలింది. ఆదిలాబాద్‌కు చెందిన రైతు కొత్తగూడెం, వరంగల్‌లో పత్తిని విక్రయించినట్లు జిన్నింగ్ మిల్లర్లు ఆధార్, పట్టా పాస్‌పుస్తకాలతో మాయజాలం చేశారు. దీంతో ఈసారి ఏ జిల్లా రైతులు ఆ జిల్లాలోని జిన్నింగ్ మిల్లుల్లోనే పత్తిని విక్రయించాలని సీసీఐ నిబంధన విధించింది. కొత్త జిల్లాల వారీగా ఈ విక్రయాలు జరగాలని తొలుత సీసీఐ నిర్ణయించగా, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు విజ్ఞప్తి మేరకు ఆ పరిధిని ఉమ్మడి జిల్లాకు పెంచారు. దీంతోపాటే అన్ని మిల్లుల్లో ఏకకాలంలో కొనుగోళ్లు జరపకుండా ఎల్–1, ఎల్–2, ఎల్–3 కింద ఒక్కో జిల్లాలో మిల్లులను 10 నుంచి 12 కేటగిరీలుగా విభజించారు.
రిజి్రస్టేషన్ చేసుకున్న రైతులు ఆయా జిల్లాల్లో సీసీఐ ఎల్–1గా ఎంపిక చేసిన మిల్లులకే తొలుత పత్తిని విక్రయించాల్సి ఉంటుంది. ఎల్–1 మిల్లుల సామర్థ్యం పూర్తయిన తరువాతే ఎల్–2కి, ఆ తరువాత ఎల్–3కి అలా ఎల్–12 వరకు మిల్లులను విభజించారు. రాష్ట్రంలో ఉన్న 322 మిల్లుల్లో ఇప్పటివరకు తెరుచుకున్నవి 220 కాగా, ఇందులో ఎల్–1 కింద ఎంపికైన మిల్లులు 117 మాత్రమే. రాష్ట్రంలో ఏ మిల్లులోనైనా పత్తిని దూది, గింజలుగా వేరు చేసేందుకు సీసీఐ చెల్లిస్తున్న మొత్తం ఒక బేల్‌కు రూ.1,440 అని, 322 మిల్లులు ఇదే ధరతో మిల్లింగ్ చేస్తున్నప్పుడు ఎల్–1, ఎల్–2, ఎల్–3 అంటూ విభజన ఎందుకని మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. అయితే, పారదర్శకత కోసమే ఈ విభజన అని సీసీఐ చెపుతోంది.
మిల్లర్లను సముదాయించిన మంత్రి తుమ్మల
సీసీఐ నిబంధనలతో మిల్లులను నడపలేమని యాజమాన్యాల సంఘం ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. గురువారం నుంచే నిరవధికంగా అన్ని మిల్లులను మూసివేస్తామని సంఘం అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి ప్రకటించగా, బుధవారం రాత్రి వరకు సంఘం నాయకులతో మంత్రి తుమ్మల, మార్కెటింగ్ అధికారులు చర్చలు జరిపి ఆంక్షలను ఎత్తివేసేలా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో బంద్ వాయిదా పడింది. కాగా, సీసీఐ నిబంధనలతో ఆదాయంపై దెబ్బ పడిందని భావిస్తున్న మిల్లర్లు త్వరలోనే మరోసారి అలి్టమేటం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.


