అన్నదాతలకు ప్రతి అడుగులో బాబు సర్కారు దగా
పుట్టెడు కష్టాల్లో రైతన్నలు.. ఏడాదిన్నరగా పడరాని పాట్లు.. 300 మందికిపైగా ఆత్మహత్యలు
సాక్షి, అమరావతి: పాడి పంటలు.. భోగి మంటలతో కళకళలాడాల్సిన అన్నదాతల లోగిళ్లు కళ తప్పాయి. పంటలు చేతికందే సమయంలో సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ సంక్రాంతి లక్ష్మికి స్వాగతాల తోరణాలు రైతన్నల ఇంట కనిపించడం లేదు. చంద్రబాబు సర్కార్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. విత్తనాలు, ఎరువులు, చివరకు గిట్టుబాటు ధరల కోసం గత 19 నెలలుగా పడరాని పాట్లు పడుతున్నారు. ప్రభుత్వ నిర్వాకానికి తోడు వరుస వైపరీత్యాలతో పంటలు దెబ్బతినగా, చేతికొచ్చిన అరకొర పంటకు మద్దతు ధర కోసం రైతన్నలు రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. గద్దెనెక్కగానే ఆర్బీకేల ద్వారా నాన్ సబ్సిడీ విత్తనాలకు మంగళం పాడేసిన చంద్రబాబు ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలలో కూడా అడ్డగోలుగా కోతలు పెట్టి అన్నదాతలకు నాణ్యమైన విత్తనాలు అందించకుండా ముప్పు తిప్పలు పెడుతోంది. మరోవైపు అదునుకు యూరియా అందక రైతులు పడిన ఇక్కట్లు వర్ణనాతీతం. ఎన్నడూ లేనివిధంగా ఒక్క కట్ట యూరియా కోసం పొలం పనులు వదిలేసి కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సిన దుస్థితి దాపురించింది. సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల అమలులో ఘోరంగా విఫలమైన చంద్రబాబు సర్కారుపై రైతన్నలు మండిపడుతున్నారు.
మద్దతు ధర దక్కక.. కొనేవారు లేక..
చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర కాదు కదా కనీసం కొనేవారు లేని దుస్థితి ఏర్పడింది. ధాన్యం, పత్తి, ఉల్లి, టమాటా, మిరప, మామిడి, పొగాకు, అరటి, చీని... ఇలా ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కక రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత ఖరీఫ్ సీజన్లో ఓవైపు తీవ్ర వర్షాభావ పరిస్థితులకు తోడు మోంథా, దిత్వా లాంటి తుపాను వైపరీత్యాలు అన్నదాతల కష్టాన్ని మట్టిపాలు చేశాయి. ఒక్క మోంథా తుపాను వల్లే దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. వర్షాభావ పరిస్థితులతో రాయలసీమ జిల్లాల్లో మరో మూడు లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినా చంద్రబాబు సర్కారు ఏ ఒక్క రైతుకూ పైసా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. ఒకపక్క పతనమైన దిగుబడులు.. మరోపక్క కనీస మద్దతు ధరలు కరువై రైతన్నలు రోడ్డెక్కారు. చంద్రబాబు సర్కారు నిర్వాకాలతో గతేడాది రూ.35 వేల కోట్లకుపైగా దిగుబడి, పంట నష్టాలను చవి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఏలూరు జిల్లా కో–ఆపరేటివ్ సొసైటీ వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు (ఫైల్)
సుఖీభవ పేరిట దగా..
తాము అధికారంలోకి రాగానే పీఎం కిసాన్‌తో సంబంధం లేకుండా ప్రతీ రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని సూపర్ సిక్స్‌లో చంద్రబాబు హామీ ఇచ్చారు. తొలి ఏడాది ఈ పథకానికి పూర్తిగా ఎగనామం పెట్టారు. రెండేళ్లలో ఒక్కో రైతుకు రూ.40 వేల చొప్పున ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.పది వేలు మాత్రమే విదిల్చారు. అన్నదాతా సుఖీభవలో ఒక్కో రైతుకు రెండేళ్లలో రూ.30 వేలు ఎగ్గొట్టారు. ఎన్నికల హామీ మేరకు 53,58,366 మంది రైతులకు పథకాన్ని వర్తింప చేయాల్సి ఉండగా ఏడు లక్షల మందికి సాయం అందించకుండా కోత పెట్టారు. ఈ ఒక్క పథకం కింద రెండేళ్లలో రైతులకు రూ.16,746 కోట్లు ఎగ్గొట్టారు. ఇక ఏ ఒక్క కౌలు రైతుకూ పైసా కూడా పెట్టుబడి సాయం ఇచ్చిన దాఖలాలు లేవు.
బీమా పోయింది.. ఇన్‌పుట్ సబ్సిడీ లేదు
చంద్రబాబు సర్కారు రాగానే ఉచిత పంటల బీమాను అటకెక్కించింది. సున్నా వడ్డీ పంట రుణం పథకానికి సున్నా చుట్టేశారు. ధరల స్థిరీకరణ నిధిని ఎత్తేశారు. ఇన్‌పుట్ సబ్సిడీని ఎగ్గొట్టారు. ఈ–క్రాప్ విధానాన్ని నిర్వీర్యం చేశారు. రైతు సంక్షేమ పథకాలకు మంగళం పాడేశారు. 2024 జూన్‌లో కట్టాల్సిన రూ.930 కోట్ల ప్రీమియం సొమ్ములు చెల్లించకపోవడంతో 11 లక్షల మంది రైతులకు రూ.1,385 కోట్ల బీమా పరిహారం అందకుండా చేశారు. 3.91 లక్షల మంది రైతులకు రూ.328 కోట్ల కరువు సాయం ఎగ్గొట్టారు. దాదాపు 12 లక్షల మందికి రూ.500 కోట్ల సున్నా వడ్డీ రాయితీకి సున్నా చుట్టేశారు. వరుస వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న ఆరున్నర లక్షల మందికి రూ.వెయ్యి కోట్లకుపైగా ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించలేదు. ప్రభుత్వ నిర్వాకం వల్ల దాదాపు 300 మందికిపైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా ఏ ఒక్క కుటుంబానికీ పైసా పరిహారం ఇవ్వలేదు. మరి చేతిలో చిల్లిగవ్వ లేని దుస్థితిలో తాము పండగెలా చేసుకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు.
ఏ పంటకూ మద్దతు లేదు..
అన్నదాతా సుఖీభవ కింద ఏటా రూ.20 వేలు ఇస్తామన్నారు. తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాది ఎవరికి పడ్డాయో తెలియడం లేదు. ఎకరాకు రూ.లక్ష చొప్పున అప్పు చేసి టమాటా, పత్తి, కూరగాయలు సాగుచేశా. అధిక వర్షాల వల్ల పంటలన్నీ దెబ్బతిన్నాయి. కొద్దిగా పత్తి మిగలగా క్వింటాకు రూ.5 వేలు మించి ఇవ్వలేదు. కేంద్రానికి తీసుకెళ్తే కొనే పరిస్థితి లేదు. చేతిలో పెట్టుబడి డబ్బులు లేక రబీ సాగుకు మా గ్రామంలో చాలా మంది రైతులు దూరమయ్యాం. ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కడం లేదు. రైతులందరూ ఆర్థికంగా చితికిపోయారు. పండుగలు చేసుకునే పరిస్థితి లేదు.
– కే.తిమ్మయ్య, నలకలదొడ్డి, కర్నూలు జిల్లా
ఆదుకోవడంలో దారుణ వైఫల్యం..
కౌలు రైతులకు పైసా కూడా పెట్టుబడి సాయం అందలేదు. ఉచిత పంటల బీమాను ఎత్తివేయడంతో ప్రీమియం భారంగా మారింది. లక్షలాది మంది రైతులు పంటల బీమాకు దూరమయ్యారు. పంట నష్టపరిహారం, సున్నా వడ్డీ రాయితీ లేదు. ఓవైపు దిగుబడులు తగ్గిపోగా మరోపక్క ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఏ ఇంటా సంక్రాంతి సంతోషం లేదు.
– వి. కృష్ణయ్య, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
90 శాతం కౌలు రైతులే...
కౌలు రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. దాదాపు 300 మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే వారిలో 90 శాతానికి పైగా కౌలురైతులే ఉన్నారు. ఏ ఒక్కరికీ పైసా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు.
– ఎం.హరిబాబు, ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలురైతుల సంఘం


