హెరిటేజ్‌ ఫ్యాక్టరీతో నష్టపోతున్నాం | Farmers and locals protest at Heritage Factory | Sakshi
Sakshi News home page

హెరిటేజ్‌ ఫ్యాక్టరీతో నష్టపోతున్నాం

Jun 10 2025 4:36 AM | Updated on Jun 10 2025 4:36 AM

Farmers and locals protest at Heritage Factory

నీటి కాలుష్యంతో పంటలు పండట్లేదు

మాకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు

తిరుపతి జిల్లా కాశిపెంట్లలోని హెరిటేజ్‌ ఫ్యాక్టరీ వద్ద రైతులు, స్థానికులు ఆందోళన

చంద్రగిరి: హెరిటేజ్‌ ఫ్యాక్టరీ వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని.. నీటి కాలుష్యం వల్ల పంట దిగుబడులు సరిగ్గా చేతికిరాక.. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ ఏర్పాటు సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని కాశిపెంట్ల సమీపంలో ఉన్న హెరిటేజ్‌ ఫ్యాక్టరీ ముందు స్థానికులు, రైతులు బైఠాయించి నిరసన తెలిపారు. 

నిరసనకారులు మాట్లాడుతూ.. హెరిటేజ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు సమయంలో గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు కల్పి­స్తామంటూ హామీ ఇచ్చారని చెప్పారు. ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశు వైద్యశాల ఏర్పాటు చేస్తామని, ఇంటింటికి తాగునీరు అందిస్తామని, రోడ్లు నిర్మించి ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దుతామని హామీలు ఇచ్చారని తెలిపారు. దీంతో ఫ్యాక్టరీ ఏర్పాటుకు సహకరించామన్నారు. కానీ, ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పైగా.. గాలి, నీటి కాలుష్యం వల్ల తమ పంటలు నాశనం అవుతున్నాయని.. ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయని వాపోయారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకొని.. నిరసనకారులు, అధికారులతో మాట్లాడారు. సమస్య పరిష్కారమయ్యేలా యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తామని ఫ్యాక్టరీ అధికారులు హామీ ఇవ్వడంతో స్థానికులు తాత్కాలికంగా నిరసనను విరమించారు.

Advertisement
 
Advertisement
Advertisement