సీఎం తొలి సంతకంతోనే మోసం
ప్రధాన భూమిక చినబాబుదే
421 స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు అమ్ముకున్నారు
రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించండి
4వ తేదీ నుంచి దశల వారీగా దీక్షలు
కలెక్టర్‌కు వివరించినభూమన కరుణాకరరెడ్డి
తిరుపతి అర్బన్: ‘డీఎస్సీలో పెద్ద ఎత్తున అవినీతిఅక్రమాలు చోటుచేసుకున్నాయి. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి..’ అని వైఎస్సార్‌సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి, తిరుపతి కార్పొరేషన్ మాజీ చైర్‌పర్సన్ డాక్టర్ శిరీషా, పార్టీ సీనియర్ నేత చెవిరెడ్డి రఘనాథ్‌రెడ్డి, తిరుపతి నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డితో కలసి కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
స్పోర్ట్స్ కోటా టీడీపీ కార్యకర్తలకా?
స్పోర్ట్స్ కోటాలో పతకాలు సాధించకపోయినా చాంపియన్స్ పేరుతో టీడీపీ కార్యకర్తలకు అడ్డదిడ్డంగా డీఎస్సీ ఉద్యోగాలు ఇచ్చేశారని భూమన వెల్లడించారు. దాంతోనే తాము సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
సీబీఐతో విచారణ చేపట్టాలి
ఫీజు బకాయిలు రూ.9,500 కోట్లా?
ఫీజురీయింబర్స్‌మెంట్, వసతి దీవెన పథకాలకు సంబంధించి రూ.9,500 కోట్ల బకాయిలు ఉన్నాయని, వెంటనే వాటిని చెల్లించాలని భూమన డిమాండ్ చేశారు. ఏటా 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని, అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసేలేదన్నారు.
మరోవైపు నిరుద్యోగ భృతిగా ప్రతి నెలా రూ.3 వేలు ఇస్తామని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారని, అయితే రాష్ట్రంలో 20 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని భూమన తెలిపారు. రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి చెల్లించలేదని మండిపడ్డారు. తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేయాలని ఆయన కలెక్టర్‌ను కోరారు. డీఎస్సీలో చోటుచేసుకున్న అవినీతిపై ఈ నెల 4వ తేదీ నుంచి దశల వారీగా దీక్షలు, నిరసనలు చేపడుతామని స్పష్టం చేశారు. ఆయనతోపాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.


