తిరుపతి సిటీ: పరిశ్రమలు, విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో జరిగే సాంకేతిక పరిశోధన ఫలితాలు సమాజానికి ఉపయోగపడాలని ఎస్వీయూ రెక్టార్ ప్రొఫెసర్ సీహెచ్ అప్పారావు పిలుపునిచ్చారు. ఎస్వీయూ జీవరసాయన శాస్త్ర విభాగం, రూసా ఫేజ్ 2 సహకారంతో ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెర్బల్ అండ్ సింథటిక్ డ్రగ్ డెవలప్‌మెంట్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జీవశాస్త్రాల్లో ఆవిష్కరణలు, వ్యవస్థాపకతపై జరిగే జాతీయ సదస్సు గురువారం సెనేట్ హాల్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, స్టార్టప్‌ల అభివృద్ధి, పరిశ్రమ, విశ్వవిద్యాలయ భాగస్వామ్యంపై నిపుణుల ప్రసంగాలు పరిశోధకులకు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. అనంతరం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు చెందిన యాస్పైర్ బైయోనెస్ట్ సీనియర్ అడ్వైజర్ అండ్ డైరెక్టర్ ఆచార్య యోగేశ్వరరావు జ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థ రూపకల్పనలో స్టార్టప్‌ల పాత్ర అనే అంశంపై ప్రధాన ఉపన్యాసం చేశారు. ఈ సదస్సులో రిజిస్ట్రార్ భూపతినాయుడు, జీవరసాయన శాస్త్ర విభాగాధిపతి సదస్సు అధ్యక్షుడు ఆచార్య ఓవీఎస్ రెడ్డి, కన్వీనర్ ఆచార్య బాలాజీ, బెంగళూరుకు చెందిన డాక్టర్ చంద్రశేఖర్ నాయర్, డాక్టర్ బీవీ రవికుమార్, ఆచార్య రాజగోపాల్, ప్రిన్సిపల్ పద్మావతమ్మ, రూసా కో–ఆర్డినేటర్ డాక్టర్ కెవీ సుచరిత, సీఈఓ వంశీకృష్ణరాయల్, ఆచార్య హేమ, ఆచార్య రంజని, ఆచార్య రాజశేఖర్ పాల్గొన్నారు.


