తిరుపతి సిటీ: ఏపీ ఈఏపీసెట్ వెబ్‌ఆప్షన్ల ప్రక్రియను ఆగస్టు 3 వరకు పొడిగిస్తూ సాంకేతిక విద్యామండలి నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఒకటో తారీఖు వరకు కొనసాగుతుందని, గురువారంతో ముగియనున్న వెబ్‌అప్షన్ల ఎంపిక ప్రక్రియను విద్యార్థుల అభ్యర్థన మేరకు సోమవారం వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. సీట్ల కేటాయింపు యథావిధిగా 6వ తేదీ ప్రకటించనున్నట్లు తెలిపారు. కాగా ఈ ఏడాది ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ గందరగోళంగా ఉందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇంటర్ ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసిన ఎంతో మంది విద్యార్థులకు సంబంధించి ఇంటర్ మార్కులు శాతం ఈఏపీసెట్ ర్యాంక్ ప్రకటనలో పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఫుడ్ పాయిజన్‌పై
విచారణకు కమిటీ
తిరుపతి తుడా: స్విమ్స్‌లో ఫుడ్ పాయిజన్‌న్ పై వస్తున్న వార్తలను నిర్ధారించేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేసినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలిపారు. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ ఈ మేరకు గురువారం ఆరుగురు నిపుణులతో ప్రత్యేక కమిటీని నియమించి 48 గంటల్లో విచారించి నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు తెలిపారు. కమిటీ చైర్మన్‌గా మంగళగిరి ఎయిమ్స్ అకడమిక్ డీన్ డాక్టర్ రామ్మోహన్, కన్వీనర్‌గా ఆర్‌ఎంఓ డాక్టర్ కే.సతీష్, సభ్యులుగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ బాలకృష్ణనాయక్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఆర్.జగదీష్, పద్మావతి మహిళా వైద్యకళాశాలా ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉమామహేశ్వరరావు, స్విమ్స్ కమ్యూనిటీ మెడిసన్ ప్రొఫెసర్ రవిశంకర్‌ను నియమించారు.
కొత్త గ్యాస్ కనెక్షన్లకు నో చాన్స్
తిరుపతి అర్బన్: వంద రోజులుగా కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం లేదు. జిల్లాలో 8.5 లక్షల కుటుంబాలు ఉండగా.. 6.03 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. ప్రస్తుతం గ్యాస్ కనెక్షన్లు 4.92 లక్షల మందికి మాత్రమే ఉన్నాయి. పెద్ద కుటుంబాలు విభజన నేపథ్యంలో కొత్త కాపురాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త గ్యాస్ కనెక్షన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా ప్రయోజం లేకుండా పోతోంది. కొత్త కనెక్షన్లు ఇప్పట్లో ఇవ్వలేమంటూ ఏజెన్సీలు చేతులెత్తేస్తున్నాయి. వంద రోజులుగా గ్యాస్ సిలిండర్ల డిమాండ్ నేపథ్యంలో ఉన్న కనెక్షన్లకే సిలిండర్లు అందించలేకపోతున్నామంటూ సమాధానం ఇస్తున్నారు. ఇప్పటికే ఒక సిలిండర్ బుకింగ్ చేసిన తర్వాత మరో సిలిండర్ బుకింగ్ చేయడానికి 45 రోజుల గడువు విధించారు. అప్పటి వరకు ఆన్‌లైన్ బుకింగ్ పనిచేయడం లేదు. ఈ క్రమంలో కొత్త కనెక్షన్లు ఇస్తే అందరికీ సిలిండర్లు సరఫరా చేయలేమని పేర్కొంటున్నారు.
ముగిసిన జాతీయ సదస్సు
తిరుపతి సిటీ: ఎస్వీ ఆర్ట్స్ కళాశాల రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా సస్టైయినబుల్ కెమికల్ కాంపౌండ్ సింథసీస్ రెడ్యూసింగ్ ఎన్విరాన్‌మెంటల్ ఫ్యాక్ట్ అనే అంశంపై గత రెండు రోజులుగా జరిగిన జాతీయ సదస్సు గురువారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ఐఐటీ ఖారగ్‌పూర్ ప్రొఫెసర్ ఏ.రాజ్‌కుమార్ హాజరై పర్యావరణహిత రసాయన పరిశోధనలు, సుస్థిర సాంకేతికతల అభివృద్ధి, భవిష్యత్ పరిశోధనా అవకాశాలపై ప్రసంగించారు. న్యూఢిల్లీకి చెందిన ఆర్‌అండ్‌డీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డివిజన్ సీనియర్ డైరెక్టర్ హరీష్‌కుమార్ దేశంలో పరిశోధనలకు అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, నిధులు, ఆవిష్కరణల ప్రాధాన్యతను వివరించారు. అనంతరం ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వేణుగోపాల్‌రెడ్డి సదస్సు విజయవతంపై హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సదస్సుకు హాజరైన శాస్త్రవేత్తలను, అతిథులను సత్కరించారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. బుధవారం అర్ధరాత్రి వరకు 74,471 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 35,361 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.68 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.


