రూ.600 కోట్ల విలువ చేసే స్థలాన్ని రూ.20 కోట్లకే కేటాయింపు
రూ.200 కోట్లు కమీషన్ కోసమే ప్రయివేటు సంస్థకు
అలిపిరి వద్ద రూ.3వేల కోట్ల విలువ చేసే టీటీడీ స్థలం ఓబెరాయ్ హోటల్‌కు
దామినేడు వద్ద ప్రైవేటు సంస్థలకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించిన భూమన
తిరుపతి మంగళం : తిరుపతి ఆధ్యాత్మిక నగరం, తిరుచానూరు అమ్మవారి ఆలయానికి కూతవేటు దూరంలోని టూరిజం స్థలాన్ని కమీషన్ల కోసం చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేష్ అప్పనంగా ప్రయివేటు సంస్థలకు ధారాదత్తం చేశారని వైఎస్సార్‌సీపీ రాష్ట అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుచానూరు సమీపంలోని దామినేడు పక్కనే జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న టూరిజం స్థలాన్ని శుక్రవారం మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి తదితర నాయకులతో కలసి భూమన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ సమీపంలో, జిల్లా కలెక్టరేట్‌కు ఎదురుగా ఉన్న 22ఎకరాల ప్రభుత్వ టూరిజం స్థలాన్ని బెంగళూరుకు చెందిన దివ్యశ్రీ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్‌కు చెందిన సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు మంత్రి లోకేష్ అప్పనంగా ధారాదత్తం చేశారని మండిపడ్డారు. ఎవరబ్బ సొమ్మని రూ.600 కోట్ల విలువ చేసే 22 ఎకరాల టూరిజం స్థలాన్ని రూ.20 కోట్లకే కట్టబెట్టారని ప్రశ్నించారు. రూ.200 కోట్ల కమీషన్ కోసమే లోకేష్ టూరిజం స్థలాన్ని అప్పనంగా అప్పగించేశారని ఆరోపించారు. మూడేళ్లలో ఈ భూమి రూ.2వేల కోట్లు విలువ చేస్తుందన్నారు. దామినేడు ప్రాంతాల్లో నివసించే పేదవాళ్లకు సెంటు భూమి ఇవ్వడానికి లేదు కానీ ఫైవ్‌స్టార్ హోటళ్లకు, స్పాసెంటర్లకు, మసాజ్ సెంటర్లకు ఎకరాలు ఎకరాలు కేటాయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓబెరాయ్ అలిపిరి వద్ద రూ.3వేల కోట్ల టీటీడీ స్థలం
తిరుపతిలోని అలిపిరి శ్రీవారి పాదాల చెంత రూ.3 వేల కోట్ల విలువ చేసే టీటీడీ స్థలాన్ని గోవు మాంసం అమ్మకాలు చేసే ఓబెరాయ్ హోటల్‌కు చంద్రబాబు కట్టబెట్టారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి స్థలానికి విలువ కట్టలేమని, అలాంటి స్థలాన్ని టూరిజానికి అప్పగించి వారి నుంచి ఓబెరాయ్ హోటల్‌కు కేటాయించడం అంతకన్నా దుర్మార్గం మరొకటి లేదన్నారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేష్‌కు ప్రైవేటు సంస్థల నుంచి వచ్చే కమీషన్లే తప్ప దైవక్షేత్రాలు అపవిత్రమవుతాయన్న ఆలోచన కొంచమైనా లేదన్నారు. దైవ క్షేత్రాలను అపవిత్రం చేయాలని చూస్తే ఎస్సార్‌సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
ఆ హక్కు చంద్రబాబుకు ఎక్కడిది?
తిరుచానూరు పంచాయతీ దామినేడు ప్రాంతంలోని దళితుల ఆధీనంలో ఉండి సాగు చేసుకుంటున్న భూములను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేస్తే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారని మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి ప్రశ్నించారు.


