టీడీపీ ఎమ్మెల్యే బంధువు గుప్పెట్లో ఇన్నీసుపేట కోృఆపరేటివ్‌ బ్యాంకు | Efforts to convert Co operative Urban Bank from Cooperative Societies Act to Max Act | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యే బంధువు గుప్పెట్లో ఇన్నీసుపేట కోృఆపరేటివ్‌ బ్యాంకు

Jun 25 2026 5:10 AM | Updated on Jun 25 2026 5:10 AM

Efforts to convert Co operative Urban Bank from Cooperative Societies Act to Max Act

సహకార సంఘ చట్టం నుంచి మ్యాక్స్‌ చట్టంగా మార్చేందుకు యత్నాలు

సదరు చట్టంతో నిధులు, నియామకాలు ఇకపై ఇష్టారాజ్యం 

సభ్యులు, డిపాజిటర్లకు తీవ్ర నష్టం

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 108 ఏళ్ల చరిత్ర కలిగిన ఇన్నీసుపేట కో–ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకును ప్రస్తుతమున్న సహకార సంఘ చట్టం నుంచి మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ (మ్యాక్స్‌ చట్టం)లోకి మార్చేందుకు ముమ్మర యత్నాలు సాగుతున్నాయి. ఈ నెల 28న జరిగే బ్యాంకు సర్వసభ్య సమావేశంలో ఖాతాదారులకు నజరానాలు పంచి, దాని మాటున మ్యాక్స్‌ చట్టంలోకి మారేలా వారితో సంతకాలు తీసుకునేందుకు పాలకవర్గం పన్నాగాలు చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

20 ఏళ్లుగా బ్యాంకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కోళ్ల అచ్యుత రామారావు (బాబు) రాజమహేంద్రవరం సిటీ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌కు బంధువు. రూ.145 కోట్ల డిపాజిట్లు, రూ.200 కోట్ల టర్నోవర్‌ కలిగి, 17 వేల మంది సభ్యులున్న ఈ బ్యాంకును మ్యాక్స్‌ చట్టంలోకి తెస్తే బ్యాంకు నిధులు, నియామకాలు కోళ్ల బాబు చేతుల్లోనే ఉంటాయి. మ్యాక్స్‌ చట్టంలోకి మారితే బ్యాంకు డిపాజిట్లు, ఇతర వ్యవహారాలు బ్యాంకు పాలకవర్గం ఇష్టారాజ్యంగా చేసుకునే వెసులుబాటు లభిస్తుంది.

ఎన్నికలు లేకుండా చైర్మన్‌గా కోళ్ల బాబు నచ్చినంత కాలం కొనసాగడంతో పాటు, పాలకవర్గ సభ్యులను తనకు ఇష్టమైనవారిని నియమించుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు కోళ్ళ బాబుకు అపరిమిత అధికారాలు కట్టబెట్టడం ద్వారా పరోక్షంగా బ్యాంకును ఎమ్మెల్యే చేతిలో పెట్టినట్టేనన్న భావన ఖాతాదారుల్లో వ్యక్తమవుతోంది.

ఆర్బీఐ అనుమతి లేకుండానే...
ఇన్నీసుపేట కో–ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకును మ్యాక్స్‌ చట్టంలోకి మార్చేందుకు తప్పనిసరిగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి ఎన్‌వోసీ తీసుకోవాల్సి ఉంది. కానీ అటువంటిదేమీ లేకుండానే ఈ నెల 28న జరగనున్న సర్వసభ్య సమావేశంలో ఈ బ్యాంక్‌ను మ్యాక్స్‌ చట్టం పరిధిలోకి తేవాలనే అజెండాను పాలకవర్గం రూపొందించడం కొసమెరుపు. అయితే ఇది ఎంతమాత్రం చెల్లుబాటు కాదని సహకార అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంపై పీజీఆర్‌ఎస్‌లో జిల్లా కలెక్టర్‌కు బ్యాంకు సీనియర్‌ సభ్యుడు, డిపాజిట్‌దారు యజ్జరపు మరిడయ్య ఫిర్యాదు చేశారు.

కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం...
ఇన్నీసుపేట కో–ఆపరేటివ్‌ బ్యాంకును మ్యాక్స్‌ చట్టంలోకి మార్చడం వల్ల సభ్యులు, డిపాజిటర్లకు తీవ్ర నష్టం జరుగుతుంది. సహకార సంఘం చట్టం ప్రకారం రెండు పర్యాయాలు పదేళ్లు చైర్మన్‌గా చేసిన వ్యక్తి మరలా ఉండకూడదు. కోళ్ల బాబు దానిని ఆసరాగా చేసుకుని మ్యాక్స్‌ చట్టం తీసుకువచ్చేందుకు ఆర్బీఐ ఎన్‌వోసీ లేకుండానే సర్వసభ్య సమావేశం అజెండాలో చేర్చేశారు. ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. – యజ్జరపు మరిడయ్య, సీనియర్‌ సభ్యుడు, డిపాజిట్‌దారు, ఇన్నీసుపేట కో–ఆపరేటివ్‌ బ్యాంకు, రాజమహేంద్రవరం 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement