
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కోవిడ్-19 కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. యాక్టివ్ కేసుల సంఖ్య 3 వేలకు చేరువయ్యింది. గత 24 గంటల్లోనే ఏడుగురు వైరస్‌తో మరణించడం ఆందోళన రేకెత్తిస్తోంది. పలు రాష్ట్రాల్లో కేసులు వెలుగు చూస్తున్నప్పటికీ.. దాపరికాలు పాటిస్తున్నాయి. ఈ లిస్ట్‌లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది.
ఏపీలో కోవిడ్ కేసులు(AP Covid Cases) పెరుగుతూ వస్తున్నా.. అధికార యంత్రాంగం నిస్తేజంలో ఉండిపోయింది. వైరస్ విషయంలో ప్రజలను అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుండడం స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా.. ఏలూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కలెక్టరేట్‌లోని ముగ్గురు ఉద్యోగులకు వైరస్ సోకింది. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న ముగ్గురికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటిట్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం. అయితే..
ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు.. వైద్యుల సూచన మేరకు ఆ ముగ్గురు ఉద్యోగుల్ని ఐసోలేషన్‌కి పంపించారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆందోళనకు గురయ్యారు. తమను అప్రమత్తం చేయకుండా అధికారులు ఇలా వ్యవహరించడం ఏంటని మండిపడుతున్నారు.
ఏపీలో విశాఖపట్నం, కోనసీమ, పశ్చిమగోదావరి, గుంటూరు.. ఇలా కేసులు వెలుగు చూశాయి. కడపలో కరోనా కేసు వెలుగు చూస్తే.. దానిని అధికారులు దాచిపెట్టే ప్రయత్నం చేయడం తెలిసిందే. టీడీపీ మహానాడు నేపథ్యంలోనే ప్రభుత్వ సూచన మేరకు అధికారులు అలా చేశారనే ప్రచారం విస్తృతంగా జరిగింది కూడా.
ఇదీ చదవండి: మహానాడు కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం
రాష్ట్రంలో పలు చోట్ల కోవిడ్ కేసులు నమోదు అవుతున్నా.. ఆ సంఖ్యను ఇంకా సింగిల్ డిజిట్‌గానే ప్రభుత్వం ప్రకటిస్తుండడం గమనార్హం. ఇంకోవైపు విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో కోవిడ్‌తో ఒకరు మరణించినట్టు ప్రచారం జరగ్గా.. ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం దానిని కొట్టిపారేశారు.
దేశవ్యాప్తంగా కోవిడ్ లెక్కలు
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ గణాంకాల ప్రకారం.. భారత్‌లో కోవిడ్-19 యాక్టివ్ కేసుల సంఖ్య(Covid Active Cases) 2,710కి చేరింది. కిందటి వారంతో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం. తాజా డాటా ప్రకారం కేరళలో రికార్డు స్థాయిలో 1,147 కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్‌లో 223 కేసులు రికార్డు అయ్యాయి. కర్ణాటక, తమిళనాడులో చెరో 148 కేసులు, పశ్చిమ బెంగాల్‌లో 116 కేసులు వెలుగు చూశాయి.
గత 24 గంటల్లో.. కోవిడ్‌తో ఏడుగురు(India Covid Deaths) మరణించారు. మహారాష్ట్రలో ఇద్దరు, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, పంజాబ్, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. వీళ్లలో 50 ఏళ్ల పైబడిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. గత ఐదు నెలలో మొత్తంగా వైరస్ ధాటికి 22 మంది మృతి చెందారు. అయితే..

ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో తీవ్రత అంతగా ఉండడం లేదని, పాజిటివ్‌గా నిర్ధారణ అయిన నాలుగైదు రోజుల్లోనే బాధితులు కోలుకుంటున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకూ నమోదైన కేసుల్లో.. జ్వరం, జలుబు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయన్నారు. జ్వరం తీవ్రంగా ఉన్నవారు మాత్రం కాస్త ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు. అయితే..
ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం రాకున్నా.. జాగ్రత్తలు మాత్రం కచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు. మాస్కులు ధరించాలని, అవసరమైతే తప్ప.. ప్రయాణాలు చేయరాదని, ఫంక్షన్లకు హాజరు కావొద్దని సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, గర్భిణులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న వారు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: భారత్‌లో కోవిడ్: శరవేగంగా వ్యాప్తి.. ఎందుకో తెలుసా?