
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ మరోసారి విజృంభిస్తోంది. ఈసారి కొత్త ఉపరకాల(Variants) రూపంలో కలకలం సృష్టిస్తోంది. దాదాపు.. ఏడాదిన్నర తర్వాత పలు రాష్ట్రాల్లో కోవిడ్-19 కేసులు నమోదు అవుతున్నాయి. మరీ ముఖ్యంగా గ్రామీణేతర ప్రాంతాల్లోనే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటోంది.
జేఎన్.1 వేరియంట్ నుంచి పుట్టుకొచ్చిన మరో కొత్త వేరియెంట్లు ఎల్ఎఫ్.7, ఎన్బీ.1.8.1 భారత్‌లో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం (INSACOG) శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది.
ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కొత్త కేసులు వెలుగు చూశాయి. ఏడాదిన్నర తర్వాత ఒడిషాలో కొత్త కేసు నమోదుకాగా, రాజధాని రీజియన్‌లో మూడేళ్ల తర్వాత కోవిడ్ కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. కేరళలో గరిష్టంగా 273 కోవిడ్ కేసులు, కర్ణాటకలో 35, మహారాష్ట్ర ముంబైలో 95.. థానేలో 10, ఢిల్లీలో 23 కేసులు రికార్డయ్యాయి.
తెలుగు రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాల్లో వైరస్ లక్షణాలతో ఆస్పత్రుల్లో బాధితులు చేరుతున్నప్పటికీ.. అధికారికంగా మాత్రం ప్రకటించడం లేదు. అదే సమయంలో కేంద్ర ఆరోగ్య శాఖ కూడా రాష్ట్రాల కోసం ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) జేఎన్.1 వేరియంట్‌ను దాని వేగవంతమైన వ్యాప్తి కారణంగా ‘వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్‘గా వర్గీకరించింది. కానీ, ప్రస్తుతానికి ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్‘గా ప్రకటించలేదు.
మరోవైపు.. శరవేగంగా కొత్త వేరియెంట్లు వ్యాప్తిస్తున్నప్పటికీ.. లక్షణాలు మాత్రం స్వలంగానే ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ కొత్త ఉపరకాల లక్షణాలు సాధారణంగా గతంలోని ఒమిక్రాన్ వేరియంట్ల మాదిరిగానే ఉంటున్నాయి. గొంతు నొప్పి, తేలికపాటి దగ్గు, అలసట, జ్వరం వంటివి ప్రధాన లక్షణాలుగా కన్పిస్తున్నాయి. అయితే, డెల్టా వంటి పాత వేరియంట్లలో కనిపించిన రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు ఈ కొత్త వేరియంట్ల బారిన పడినవారిలో అంతగా కనిపించడం లేదని వైద్యులు చెబుతున్నారు.

ఆస్పత్రుల్లో హైఅలర్ట్
కోవిడ్(Covid-19) బారినవారు నాలుగు రోజుల్లోనే కోలుకుంటున్నారని ఇండియా కరోనా ట్రాకర్ ఆధారంగా.. ఇండియా టుడే తన కథనంలో పేర్కొంది. హైదరాబాద్(తెలంగాణ)లో పేషెంట్ల కోసం ముందస్తుగా పరీక్ష చేసుకున్న ఓ వైద్యుడికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. అయితే ఆయన స్వల్ప జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుత వైరస్ వ్యాప్తితో లక్షణాలు స్వలంగా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నప్పటికీ.. ముందస్తు జాగ్రత్తగా పలు రాష్ట్రాలు కోవిడ్-19 మార్గదర్శకాలను జారీ చేశాయి. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, శుభ్రత.. వ్యక్తిగత శుభ్రత పాటించాలని కోరుతున్నాయి. ఆసుపత్రులలో పడకలు, ఆక్సిజన్, మందులతో ప్రత్యేక వార్డులను సిద్ధం చేస్తున్నాయి. అయితే అధిక ప్రమాదం ఉన్నవారు (వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు) బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.